ఎన్నారైల కల ఎంత కాలానికి తీరిందబ్బా!

August 06, 2020

ఇటీవలే అన్నీ బ్యాడ్ న్యూస్ లే వింటున్న మనకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డుల విషయంలో మనకు, చైనాకు ఇంపుగా ఉండే నిర్ణయానికి మద్దతు తెలిపింది. ఇంతకీ విషయం ఏంటంటే... విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వతంగా స్థిరపడటానికి ఉద్దేశించిన ‘గ్రీన్ కార్డు’ల జారీపై గరిష్ట పరిమితిని ఎత్తివేసింది. అంటే అమెరికాలో ఉద్యోగం వస్తే... మనం ఉంటామో లేదో అన్న శంక అక్కర్లేదు. అంతకంటే ముందే ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది నమ్మలేని గుడ్ న్యూస్. ఇంతవరకు ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సెనెట్ ఆమోదం కూడా తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెద్దసంఖ్యలో గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆమోదం పొందాలంటే 70 ఏళ్లు పడుతుందని అంచనాలున్నాయి. తాజా బిల్లు ఆమోదంతో దరఖాస్తులు పెట్టుకున్న వారి కలలన్నీ నెరవేరనున్నాయి. పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలిపోతున్న మన లాంటి దేశాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్.
అంతేకాదు... ఇందులో మరో మంచి వార్త కూడా ఉంది. ‘ఫ్యామిలీ స్పాన్సర్డ్‌’ విభాగంలో కూడా కోటాను 15 శాతానికి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికాలోని సంస్థలు హెచ్‌-1బి వీసాల ద్వారానే విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసాలపై పనిచేసేవారిలో భారతీయులే అత్యధికం. హమ్మయ్య... ఎంత మంచి న్యూసో కదా!