గుడివాడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..?

June 01, 2020

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు రెండు ఒకేసారి రావడంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ముఖ్యంగా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో రోమాలు నిక్కబొడిచేలా ఎవరు గెలుస్తారా? అనే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వాటిలో మొదటగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం  కృష్ణా జిల్లా గుడివాడ. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని బరిలో ఉంటే.. టీడీపీ తరఫున దేవినేని అవినాష్ రణరంగంలోకి దూకుతున్నారు. ఈ ఇద్దరికీ ప్రజల్లో సమాన అభిమానం ఉండటంతో అక్కడి రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ చాలా చాలా టఫ్ గా మారిపోయింది.

ఇప్పటివరకు ఈ స్థానంలో వైసీపీ బలంగా కనిపించింది. వైసీపీ ప్రారంభానికి ముందు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని వైసీపీకి కంచుకోటగా మార్చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచిన కొడాలి నాని, ఆ తర్వాత వైసీపీలో చేరి.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. దీంతో ఈ సారి ఎన్నికల్లోనూ తనదే విజయమనీ దీమాగా ఉన్న నాని... టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగినా కూడా తనదే విజయమని అంటున్నారు. కానీ ప్రజల్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. నానికి అంతగా బలం లేదని అర్థమవుతోంది.

మరోవైపు ఈ సీటుపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు.. కొడాలి నానికి చెక్ పెట్టాల్సిందేననే కోణంలో పార్టీ టికెట్ ను పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణా జిల్లాలో మంచి పేరున్న దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. పార్టీ అదేశమే తరువాయి అన్నట్టుగా దేవినేని అవినాశ్ ఇప్పటికే గుడివాడలో దిగిపోయారు. దీంతో కొడాలి నాని, దేవినేని అవినాష్ ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.  వరుసగా మూడు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానికి పట్టు ఉన్నప్పటీకీ.. ఇక ఎమ్మెల్యేగా ఆయనను చూడటానికి జనం ఇష్టపడటం లేదట. ఇది అవినాష్ కి బాగా ప్లస్ అయ్యే  అవకాశముందని తెలుస్తోంది. బాబు పాలనపై కూడా అక్కడి ప్రజలు చాలా పాజిటివ్ గా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే ఈ నిజాయకవర్గ ఫైట్ రాష్ట్రంలోకెల్లా మరింత హాట్ హాట్ గా మారింది.