బీజేపీ మాట- జగన్ పనీ పాట లేనోడట !!

May 23, 2020

బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏది మాట్లాడినా ప్రత్యేకమే. తెలుగోడు అయినా... అచ్చ తెలుగు పదాలు పలకడంలో తంటాలు పడే జీవీఎల్... విషయాన్ని వ్యక్తీకరించడంలో మాత్రం ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార తీరుపై ఇప్పటికే చాలా సార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన జీవీఎల్... ఇప్పుడు ఏకంగా జగన్ ను ఓ పనీపాటా లేని నేతగా తేల్చిపారేశారు.

జగన్ ను జీవీఎల్ అంత మాట అన్నారా? అంటే... రాజకీయాల్లో కాకలు తీరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన జీవీఎల్ కు జగన్ ఓ లెక్కా అన్న వాదన వినిపిస్తోంది. అయినా ఇప్పుడు జగన్ ను జీవీఎల్ పనీపాటా లేని నేతగా ఎందుకు అభివర్ణించారన్న విషయానికి వస్తే... కాస్త ఆసక్తికరమేనని చెప్పాలి. మంగళవారం ఢిల్లీ ఫ్లైటెక్కనున్న జగన్... హస్తినలో ల్యాండ్ కాగానే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు తదితరాలపై ఆయన మోదీ, కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనను టార్గెట్ గా చేసుకునే జీవీఎల్ తాజా వ్యాఖ్యలు చేశారు.

అయినా ఈ దిశగా జగన్ ను జీవీఎల్ ఎంతగా తీసిపారేశారంటే... పనీ పాటా లేని నేతలు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొట్టినట్టుగా జగన్ కూడా మంగళవారం ఢిల్లీకి వెళుతున్నారని చెప్పుకొచ్చారు. అసలు జీవీఎల్ ఏమన్నారంటే... ‘ప్రత్యేక హోదా గురించి పనీ పాటా లేని వారే మాట్లాడతారు. అదో కాలక్షేపం సబ్జెక్ట్ అయిపోయింది’ అని జీవీఎల్ ఏమాత్రం మోహమాటం లేకుండానే చాలా ఈజీగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ ను పనీ పాటా లేని నేతగానే జీవీఎల్ అభివర్ణించారని చెప్పక తప్పదు. మరి జీవీఎల్ వ్యాఖ్యలపై జగన్ అండ్ కో ఏమంటుందో చూడాలి.