తినేది బీజేపీ కూడు.

June 01, 2020

పాడేది వైసీపీ పాట!
జీవీఎల్‌ నోట జగన్‌ మాట!
అమరావతే రాజధాని అని బీజేపీ తీర్మానం
దానిపై సంతకం కూడా చేసిన జీవీఎల్‌
తీరా ఢిల్లీ వెళ్లాక.. కేంద్రానికి సంబంధం లేదట
రాజధాని జీవో మార్చేయవచ్చట
అది రాష్ట్రప్రభుత్వ ఇష్టమట!
అమరావతి ప్రాంత ప్రజల ఆందోళనలు ఆయనకు కనిపించవు. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రెండు నెలలుగా రైతులు, మహిళలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నా.. ఉద్యమిస్తున్న జనంపై పోలీసుల లాఠీలతో విరుచుకుపడుతున్నా ఆయనకు పట్టదు. ఆయనకు కావలసింది ముడుపులే. సీఎం జగన్‌ క్రమం తప్పకుండా ఇస్తున్నారు కాబట్టి.. ఎదుట జరిగేది ఆయనకు కనిపించదు. అందుకే రాజధాని మార్పు రాష్ట్రప్రభుత్వ ఇష్టమని.. కేంద్రం ప్రమేయం ఉండదని తానే ప్రధానమంత్రిలా ప్రకటించేస్తున్నారు. బీజేపీకి మాతృసంస్థ రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబడుతోంది. అయితే అసలు అమరావతిలో జరిగేది జీవీఎల్‌ దృష్టిలో ఉద్యమమే కాదు. రైతులు, జేఏసీ ప్రతినిధుల చుట్టూ అమరావతిలో బీజేపీ నేతలు తిరుగుతుంటే.. తమ మిత్రపక్షం జనసేన కూడా ఉద్యమానికి సిద్ధమంటుంటే.. జీవీఎల్‌ దృష్టిలో వాళ్లు రైతులు కాదు.. ‘బీజేపీ కూడు తింటూ వైసీపీ పాట పాడుతున్నారు’ అన్న విమర్శ తనకు సరిగ్గా సరిపోయేలా మాట్లాడుతున్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ విషయాన్ని 2015 ఏప్రిల్‌ 23వ తేదీనే నోటిఫై చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఇటీవల లోక్‌సభలో తెలిపారు. దీంతో అసలు రాజధానిపై నోటిఫికేషన్‌ ఇవ్వలేదని జగన్‌ ముఠా చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని తేలిపోవడంతో వారిని ఆదుకోవడానికి జీవీఎల్‌ రంగప్రవేశం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాత జీవో అక్బర్‌ శిలాశాసనం లాంటిది కాదని.. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం తన పరిధిలోని అంశమైన కొత్త రాజధాని నిర్ణయాన్ని జీవో రూపంలో ఇస్తే.. కేంద్రప్రభుత్వం దానిని కూడా నోటిఫై చేస్తుందని చెప్పారు. దీనర్థం ఏమిటి? రాజధాని అమరావతిని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ తీర్మానం చేసింది. దానిపై జీవీఎల్‌ సంతకం కూడా చూశారు. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కారణమేంటి? ‘అమరావతి రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకుని ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపితే గుర్తిస్తుంది. చంద్రబాబు శిలాఫలకం చెక్కారు.. దానిపై కొత్త జీవో జారీచేసే అధికారం ఎవరికీ లేదనుకుంటే అది కూడా భ్రమలో భాగమే. ఎవరో కొందరు రైతులు, వారి పక్షాన కొంత మంది ఢిల్లీ వచ్చి అనేక మందిని కలుస్తున్నారని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నవారిని ఎవరైనా కలవొచ్చు. కానీ వారికి ఇక్కడ ఎలాంటి ఫలితం కనిపించే అవకాశం లేదు. రాజధానిని సమస్యగా చూస్తే.. దానికి సమాధానం అమరావతిలో దొరుకుతుంది గానీ దేశరాజధానిలో కాదు. పెద్దలను వారు కలవడంలో తప్పులేదు. కానీ సమాధానానికి వారు మళ్లీ అమరావతే వెళ్లాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సంఘ్‌ సిద్ధాంతకర్త రతన్‌ శార్దా తీవ్రంగా స్పందించారు. ‘ఆంధ్రకు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు వృధా చేయడాన్ని బీజేపీ అంగీకరిస్తోందా? రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలతో సీఎం జగన్‌ ఆడుకోవడాన్ని, మూడు రాజధానుల ఏర్పాటు చెత్త ఆలోచనను సమ్మతిస్తోందా’ అని నిలదీశారు. అటు రాష్ట్ర ప్రజలంతా జీవీఎల్‌పై భగ్గుమంటున్నారు. ఇప్పటికే జగన్‌కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్  షాల మద్దతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనినెలా ఎదుర్కోవాలా అని బీజేపీ రాష్ట్ర శాఖ కిందా మీదా పడుతోంది. ఇప్పుడు జీవీఎల్‌ వ్యాఖ్యలతో రైతులు, మహిళలు విరుచుకుపడుతుండడంతో మరింత ఇరకాటంలో పడింది. ఆయన తీరుతో మిత్రపక్షం జనసేన కూడా ఇరుకునపడింది.
ముడుపులు ముట్టాయి..
జగన్‌పై జీవీఎల్‌ ఇంత అవ్యాజ ప్రేమ కురిపించడానికి కారణం ముడుపులేనని విశ్లేషకులు అంటున్నారు. విశాఖలో ఓ ప్రముఖ హోటల్లో ఆయనకు వాటా ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ‘అగ్ర’ పదవిలో ఉన్న నేత కుమారుడికి కూడా అందులోని షేర్లు బదలాయించినట్లు ప్రచారం జరుగుతోంది. జీవీఎల్‌ చరిత్ర తెలిసినవారు దీనిని ఖండించడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన రాష్ట్రంలో తిష్ఠవేసి రాష్ట్ర వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చుతున్నారో సమాధానం చెప్పాలని బీజేపీ స్థానిక నేతలు అంటున్నారు. రాష్ట్ర శాఖ ఒక దారిలో వెళ్తుంటే... జీవీఎల్‌ మరో దారిలో నడుస్తూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సందర్భంలో బీజేపీ చేసిన తీర్మానంపై జీవీఎల్‌ కూడా సంతకం చేశారని గుర్తుచేస్తున్నారు. ఆనాడు అలా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎవరిచ్చిన సొమ్ములకు ఆశపడి మాట మార్చాడని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కూడా అవకాశం దొరకడంతో రెచ్చిపోతోంది. ఒకప్పుడు సాధారణ గుమస్తాగా ఉన్న జీవీఎల్‌కు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది.