అమరావతిపై మరోసారి జీవీఎల్ ఆసక్తికరం, సొంత పార్టీ నేతలకూ షాక్

June 05, 2020

బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు గురువారం మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అంశంపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాదు, రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలకు కూడా ఊహించని షాకిచ్చారు. మీరేం చెబితే అది చేయరని ఓ విధంగా ఘాటుగానే అభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పవచ్చు.

రాజధానిని నిర్ణయించుకునే అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా వేసవి రాజధానిని ప్రకటించారన్నారు. దీనిని బట్టే రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్డీఏ చట్టంపై న్యాయపోరాటం ద్వారానే స్థానిక రైతులు ఈ వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ న్యాయస్థానాలకు వెళ్తామని రైతులను మభ్యపెట్టవద్దన్నారు.

రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తాను కూడా గతంలో అదే చెప్పానన్నారు. తాను కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏదైనా మాట్లాడానని చెప్పారు. అమరావతి విషయంలోను అలాగే మాట్లాడానన్నారు. ఇందులో తన సొంత అభిప్రాయాలు ఏవీ కూడా లేవన్నారు.

రాజధాని అంశంపై మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా షాకిచ్చారు. రాష్ట్ర పార్టీ కోరిన అన్ని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయదని తేల్చి చెప్పారు. మొదటి నుండి కూడా జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రాజధాని అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎక్కువ మంది ఓ రకంగా మాట్లాడుతుంటే, ఆయన మరో రకంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.