జీవీఎల్ వ‌ర్సెస్ రాంమాధ‌వ్‌

July 08, 2020

రాంమాధ‌వ్‌, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచే నేత‌ల్లో ఒక‌రు. అందుకే ఆయ‌న్ను కీల‌క‌మైన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వరించింది. స‌హ‌జంగానే ఆయ‌న చెప్పే మాట‌కు ఎంతో విలువ ఉంటుంది. తెలుగు నేల‌కు చెందిన బీజేపీ అతి ముఖ్య నేత‌ల్లో రాంమాధ‌వ్ ఒక‌రు. ఇక మ‌రో నేత అయిన‌ జీవీఎల్ న‌ర‌సింహారావు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏపీకి చెందిన ఈ నేత బీజేపీ త‌ర‌ఫున బ‌లంగా త‌న గ‌లం వినిపిస్తారు కాబ‌ట్టే...ఆయ‌న‌కు అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి ద‌క్కింది. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా సొంత‌మైంది.

బీజేపీ కోసం కంక‌ణ‌బ‌ద్దులై ప‌నిచేసే తెలుగు నేల‌కు ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య అదే బీజేపీ వేదిక‌గా చీలిక వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం హోరాహోరీగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల గురించే ఈ ఇద్ద‌రు నేతలు ప‌ర‌స్ప‌ర విరుద్ద‌మైన మాట‌లు మాట్లాడారు. ఒక‌రు త‌మ‌దే అధికారం అంటే మ‌రొక‌రు మాకు అధికారం ద‌క్కించుకునే సీట్లు వ‌స్తాయా...అనే సందేహం వ్య‌క్తం చేశారు. విదేశీ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ మాధ‌వ్ సంచ‌ల‌న విషయం చెప్పారు. త‌మ‌కు మెజార్టీకి స‌రిప‌డా సీట్లు రావ‌డం సందేహ‌మేన‌ని అన్నారు. 'ఈసారి మాకు 271 సీట్లు వస్తే... నేను చాలా సంతోషిస్తాన`అని ఆయన బ్లూమ్‌బర్గ్‌తో అన్నారు. సొంతంగా తమ పార్టీకి మెజారిటీ రాకున్నా...తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాను రామ్‌ మాధవ్‌ వ్యక్తం చేశారు.

ఇక జీవీఎల్ న‌ర‌సింహారావు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ రాబోతోందని జీవిఎల్ ధీమా వ్యక్తం చేశారు. త‌మ పార్టీయే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతోంద‌న్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించే అవకాశమే లేదని అన్నారు. కాగా, ఇద్ద‌రు నేత‌లు ఒకే రోజు ఇలా ప‌ర‌స్ప‌ర విరుద్ద‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం...మెజార్టీ వేదిక‌గా చీలిపోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.