ప్యారడైజ్ బిర్యానీ తింటున్నారా... ఈ వార్త చదవండి

August 07, 2020

వినియోగదారులు దేవుళ్లు. మన ఉన్నతికి కారణమైన వారికి మరింత ప్రేమగా మరింత శ్రద్ధగా సేవ చేయాలి. మరి ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిన హైదరాబాదుకు చెందిన ’ప్యారడైజ్ బిర్యానీ‘ రెస్టారెంటుకు గట్టి దెబ్బ తగలిగింది. భారీ జరిమానా పడింది. వాస్తవానికి వారికి జరిగే వ్యాపారానికి పడిన జరిమానా చాలా తక్కువ అనిపించొచ్చు గాని... అంత జరిమానా వేసేంత తప్పు చేశారు అంటే... ఎంతో మంది తిండి ప్రియులను దూరం చేసుకున్నట్టే. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.

సికింద్రాబాద్ లో చిన్నగా ప్రారంభం అయిన ప్యారడైజ్ ఎన్నో దశాబ్దాలుగా రుచికి పేరు గాంచింది. చివరకు దానిపేరు మీదే ఆ ప్రాంతాన్ని ప్యారడైజ్ సర్కిల్ అనేంత స్థాయికి ఎదిగింది. దీంతో పెట్టుబడుదారులను ఆకర్షించింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. కానీ... ఆనాటి శ్రద్ధ మాత్రం అందులో నేడు కరవైన విషయం జీహెచ్ఎంసీ తనిఖీల్లో వెల్లడైంది. ఓ కస్తమర్ ప్యారడైజ్ నుంచి బిర్యానీ ఆర్డరు చేస్తే అందులో వెంట్రుకలు వచ్చాయట. ఎందుకు ఇలా జరిగింది అని అతను రెస్టారెంటును సంప్రదిస్తే దురుసు సమాధానం ఎదురైంది. దీంతో ఆ వినియోగదారుడు ఇదే విషయాన్ని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. వెంట్రుక పట్టుకుని లాగితే చాలా విషయం బయటపడింది.

ప్యారడైజ్ కిచెన్ ఏ మాత్రం పరిశుభ్రంగా లేని విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఇంత అధ్వానంగా కిచెన్ నిర్వహించి వినియోగదారుల ఆరోగ్యాలతో ఆడుకుంటారా అంటూ లక్ష రూపాయల జరిమానా విధించారట. వారం రోజుల్లో అంత చక్కదిద్దకపోతే .. హోటల్ సీజ్ చేస్తామని కూడా హెచ్చరించి వెళ్లారట. ఇంత పెద్ద రెస్టారెంట్లే ఇలా చేస్తే... ప్రజలకు బయట తినాలంటే భయమేసే పరిస్థితి.