అసెంబ్లీ సాక్షిగా హరీష్ ఆశలు ఆవిరి... ఎప్పటికీ మంత్రే!

August 10, 2020

ఎప్పటికీ కేసీఆరే మా నాయకుడు

ఎప్పటికైనా ఆయన చెప్పిందే వేదము

ఆయన ఎవరు రాజు అంటే వారే రాజు...

ఇలా హరీష్ రావు అన్ని ఇంటర్వ్యూలలో, అన్ని సందర్భాల్లో చెప్పి ఉండొచ్చు గాక... మనసులో మాట అయితే కచ్చితంగా ఇది కాదు. ఒక రాజకీయ నాయకుడి ఫైనల్ గోల్ ముఖ్యమంత్రి పదవి. ప్రధాని అనేది ఒక జాక్ పాట్. కాబట్టి ఎవరికైనా మొదటి గోల్ ముఖ్యమంత్రి పదవే అవుతుంది. పాపం హరీష్ కు ఈరోజు తో హరీష్ లో తన స్థానం ఏంటో చాలా క్లియర్ కట్ గా స్పష్టమైపోయింది. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇంతకీ ఏం జరిగింది అంటే...

ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చాలా ఆసక్తికరమైన ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఆరోగ్యం బాగలేదని పలుమార్లు గాసిప్ లు వచ్చాయి. ఇంతకాలం ఈ గాసిప్ నడిచింది అంటే.. కేసీఆర్ దృష్టిికి వెళ్లకుండా ఉండదు కదా. దానికి కేసీఆర్ ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ‘‘20 సంవత్సరాలుగా కేసీఆర్ చస్తూనే ఉన్నాడు. ఇంకా చస్తూనే ఉంటాడు. నా ఆరోగ్యం గురించి బయట ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అమెరికాకి వైద్యానికి పోతాను అన్నారు. చివరకు 20 ఏళ్ల సంది బతుకుతూనే ఉన్నాను. ఇంకా మేము ప్రజల కోసం తిప్పలు పడతాం కాబట్టి... గరిష్టంగా ఈ టెర్ముతో కలిపి మరో మూడు టెర్ములు ఉంటాము. మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. తానే ముఖ్యమంత్రిని అవుతాను. కేటీఆర్ ఇంకోసారి కూడా ముఖ్యమంత్రి కాడు. 2024లో గెలిచాక కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతాను. 2029లో కేటీ రామారావు ముఖ్యమంత్రి అవుతాడు’’ ఇది కుప్లతంగా కేసీఆర్ సారాంశం. 

ఇందులో చాలా క్లారిటీలు ఉన్నాయి.

1. నాకు ఆరోగ్యం బాగుంది, దుక్కలా ఉన్నాను. మళ్లీనేనే సీఎం అవుతాను. ఎవరికీ అవకాశం ఇవ్వను. (ఇది నేరుగా చెప్పాడు)

2. నా తర్వాత టీఆర్ఎస్ వారసత్వం... కేటీఆర్ కి చెందుతుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. (ఇది వారసత్వం అనే మాట వాడకుండా చెప్పాడు)

3. హరీష్ రావు ఇక ఎప్పటికైనా కేటీఆర్ తర్వాతి స్థానమే... మహా అయితే డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకోవాలి (ఇది పరోక్ష సంకేతం) 

టీఆర్ఎస్ పుట్టుక నాటికి కేసీఆర్ అంత గొప్ప వ్యూహకర్త ఏం కాదు. కాకపోతే క్విక్ లెర్నర్  కావడం వల్ల త్వరగా నేర్చుకున్నారు. ఆమాటకు వస్తే...  హరీష్ నుంచి నేర్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిది... ఈ రోజు ఆ పార్టీలో హరీష్ స్థానం ఒక మహ్మద్ అలీ కంటే తక్కువ. ఒక ఎర్రబెల్లి కంటే తక్కువ. ఈరోజుతో హరీష్ రావుకు జీవితంపై ఒక పక్కా క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికను వదిలేయాలా? టీఆర్ఎస్ ను వదిలేయాలా అని నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. అది ఈరోజే రేపో జరగక మానదు. ఆలస్యమైన జరిగి తీరుతుంది.