లేట్ కు ఫైన్ సూపర్ హరీశ్.. జేబులో డబ్బులైతే బాగుంటాది

February 23, 2020

నిత్యం ప్రజల్లో ఉండే వారికి.. మారిన కలానికి తగ్గట్లే ఎట్లా మారాలో వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. పని ఉన్నా లేకున్నా.. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమయ్యే అలవాటు మంత్రి హరీశ్ కు అలవాటే. ఆదివారం.. సోమవారం అన్న తేడా లేకుండా నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో తిరుగుతూ బిజీబిజీగా ఉండే హరీశ్ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఉదయం 11.30 గంటలకు రావాల్సిన ఆయన మధ్యాహ్నం 3.30 గంటల వేళకు వచ్చిన వేళ.. ఆయన కోసం గంటల కొద్దీ ఓపిగ్గా వెయిట్ చేశారు మహిళలు. దీంతో.. తన కారణంగా వెయిట్ చేసిన వారికి క్షమాపణలు చెప్పిన హరీశ్.. అక్కడితో ఆగకుండా తనకు ఫైన్ వేయాలని కోరారు. ఈ సీన్ అంతా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మెప్మా రుణాలు.. చెత్త బుట్టల పంపిణీ కోసం ఏర్పాటు చోటు కార్యక్రమంలో చోటు చేసుకుంది.
హరీశ్ మాటకు స్పందనగా అక్కడి మహిళలు.. మహిళా భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఓకే చెప్పిన హరీశ్.. ఆలస్యం చేయకుండా రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఈఎన్ సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. వినేందుకు బాగుంది కానీ హరీశ్ సారూ.. ఫైన్ మొత్తాన్ని ప్రజాధనాన్ని ఖర్చు చేసే కన్నా.. కాస్త తక్కువైనా జేబులో నుంచి కడితే చక్కటి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసినట్లు ఉండేది కదా?