ప్రజలెవరూ నన్ను హైదరాబాదులో కలవొద్దు: హరీష్ రావు

February 27, 2020

ఆసక్తికర ప్రకటన చేశారు మంత్రి హరీశ్ రావు. ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించకుండా ఉన్న ముఖ్యమంత్రి మేనల్లుడు.. తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకున్నా.. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు.. వారితో మమేకం అయ్యేందుకు హరీశ్ పడే తపన అంతా ఇంతా కాదు. సెలవు రోజున కూడా నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 300 కిలోమీటర్ల వరకూ ఆయన ట్రావెల్ చేస్తారని చెబుతారు.
ఇక.. ఆయన నియోజకవర్గంలో ఉంటే.. జాతర మాదిరి ప్రజలు పోటెత్తుతుంటారు. ఇంత చేసిన తర్వాత కూడా.. ఆ పని చేయాలి.. ఈ పని చేయాలంటూ ఆయనకు లెక్కలేనన్ని వినతులు వస్తుంటాయి. ఊళ్లోనే కాదు.. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఈ తాకిడి పెరిగిపోతోంది. అన్నింటికి మించి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీద అంచనాలు పెరిగిపోవటంతో.. తాకిడి అంతకంతకూ పెరుగుతోంది.
ఇలాంటివేళ.. అలాంటి హడావుడిని తగ్గించాలని హరీశ్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. తాను వారంలో నాలుగు రోజులు సిద్ధిపేటలోనే ఉంటానని.. అలాంటప్పుడు సమస్యలు ఏమున్నా.. తాను ఉన్నప్పుడే రావాలే తప్పించి.. హైదరాబాద్ కు రావొద్దని చెబుతున్నారు.
హైదరాబాద్ వచ్చేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని రావటం.. తీరా వారొచ్చిన తర్వాత పనులు కాకపోతే.. మనసు కష్టపెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని.. అందుకే తనను సిద్ధిపేటలోనే కలవాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏదైనా ఆసుపత్రి సమస్య వస్తే హైదరాబాద్ కు రావాలే కానీ.. మిగిలిన ఏ విషయం కోసమైనా.. తనను సిద్ధిపేటలోనే కలవాలని హరీశ్ కోరుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఖాతా ఆయనో పోస్టు పెట్టారు. ‘ఐదు వేల రూపాయిలు ఖర్చు పెట్టి బండి మాట్లాడుకొని.. టిఫిన్ ఖర్చులు పెట్టుకొని వస్తున్నారని.. ఇలా వచ్చే పనుల్లో  రూపాయికి 90 పైసలు వరకూ కాని పనులే ఎక్కువగా ఉంటాయి. అంతదూరం వచ్చి పని కాకపోతే.. మనసుకు కష్టమవుతుంది. మీ మనసు కష్టపడితే నా మనసు బాధ పడుతుంది. మీరు నొచ్చుకుంటే.. నా మనసు నొచ్చుకున్నట్లే. అందుకే.. సిద్దిపేటలోనే కలవండి. హైదరాబాద్ కు రావొద్దు’ అని స్పష్టం చేశారు.
ఇప్పుడున్నరోజుల్లో చుట్టూ మందిని వేసుకొని.. ఆ హడావుడిని చూసుకొని మురిసిపోయే దానికి భిన్నంగా.. నా కోసం అట్టే శ్రమపడొద్దు. నేనే మీ దగ్గరకు వస్తా. మీ సమస్యలు చెప్పండంటూ వివరంగా చెప్పే నేతలు ఈ కాలంలో కనిపించరని.. అందుకు భిన్నంగా హరీశ్ తీరుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఏమైనా.. హరీశ్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది.