కొత్త ట్విస్ట్: పవన్ తో నో రీమేక్

August 07, 2020

టాలీవుడ్ లో ఒక అగ్రహీరో ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పటం.. వరుస పెట్టి సినిమాలు చేయటం ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి. హీరోగా కాస్తంత పేరు వస్తే చాలు.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తామని చెప్పటం.. ఒక సినిమాను అదే పనిగా చెక్కుతూ నెలలు నెలలు చేయటం తెలిసిందే. దీంతో.. ఏడాదికి ఒక సినిమా చేసేవాళ్లు కొందరైతే.. మరికొందరు ఏడాదిన్నరకు కూడా ఒక సినిమాను పూర్తి చేయని పరిస్థితి.
ఇలాంటివేళ.. ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పటం.. యుద్ద ప్రాతిపదికన పవన్ సినిమాలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మూడో సినిమాగా గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ తో పవన్ సినిమా చేయనున్నాడు. అయితే.. ఆ సినిమా తమిళ చిత్రమైన తేరీ కానీ.. వేదాళం కానీ అవ్వొచ్చన్న వార్తలు వచ్చాయి.
పవన్ తో తాము నిర్మించే సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు రావటంతో.. తాజాగా స్పందించాడు హరీశ్. తాను ఫోన్ కాల్ దూరంలో ఉంటానని.. ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే తననే నేరుగా సంప్రదించాలే తప్పించి.. పుకార్లు షికార్లు చేసేలా రాతల వద్దని చెప్పుకొచ్చారు. దీంతో.. పవన్ తో హరీశ్ చేసే సినిమా రీమేక్ అయితే కాదన్న విషయం తేలినట్లే.