రాజధాని రైతులపై ఇంకా కక్ష తీరలేదు

August 07, 2020
కరోనా కల్లోలంలో అభిప్రాయ సేక‘రణం’!
నేరుగా ఊళ్లకు వస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
ఉద్యోగుల పేరిట ఫోన్లు చేసి బెదిరింపులు
రైతుల ఆగ్రహం.. ఎక్కడికక్కడ నిలదీతలు
హైకోర్టు తీర్పుపై గౌరవం లేదు. రాజధానికి భూములిచ్చిన రైతులపై కనీస సానుభూతి లేదు. 110 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోంది. రాజధానియేతర ప్రాంతాలకు చెందిన పేదలకు రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది. కరోనా వైరస్‌ కట్టడికి దేశమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్నా.. సీఆర్‌డీఏ అధికారులు యథేచ్ఛగా రాజధాని గ్రామాల్లో తిరుగుతూ.. భూములివ్వాల్సిందేనని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో వారు నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు.

జగన్‌ సర్కారు తెంపరితనం వల్ల రాజధాని ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరునూరైనా తాను అనుకున్నది జరగాలన్న సీఎం వైఖరితో అటు అధికారులు నలిగిపోతున్నారు. నమ్మి ఓటేసిన పాపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా.. ఓపక్క అధికారులు ఊళ్లన్నీ చుట్టేస్తుండగా.. సీఆర్‌డీఏ ఉద్యోగులమంటూ కొందరు అభిప్రాయ సేకరణ పేరిట రైతులకు ఫోన్లు చేస్తుండడం కొత్త వివాదానికి దారితీస్తోంది. ఫోన్లు చేస్తున్నవారు రైతులు ఎంత అడిగినా తమ పేరుగానీ, ఉద్యోగ హోదా గానీ వెల్లడించడం లేదు. అనుమానం వచ్చి ఆరా తీస్తే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఉద్యోగులు ఈ ఫోన్లు చేస్తున్నారని తేలింది. దీనిని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు చర్యల్లేవు. అభిప్రాయసేకరణకు నోటీసులు అందజేసేందుకు వస్తున్న అఽధికారులు, ఉద్యోగులు.. దానికే పరిమితం కాకుండా.. తమ హోదాను మించి గ్రామసభలు నిర్వహించే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. దాంతో రైతులు ప్రతిచోటా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు.
ఆర్‌-5 జోన్‌పై రగడ
సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని విస్తీర్ణంలో 5 శాతం భూమిని పేదలకు గృహ వసతిని కల్పించేందుకు నిర్దేశించారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో గృహ ప్రయోజనాలకు ఉద్దేశించిన 4 జోన్లు (ఆర్‌-1, ఆర్‌-2, ఆర్‌-3, ఆర్‌-4)లలో రాజధాని రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లుగా ఇచ్చిన నివాస స్థలాలు, ఇతర గృహాలను మాత్రమే అనుమతించాలి. దీంతో రాజధానియేతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు మాస్టర్‌ ప్లాన్‌లో ఆస్కారం లేదు. దరిమిలా జగన్‌ ప్రభుత్వం కొత్తగా ఆర్‌-5 అనే ప్రత్యేక జోన్‌ను మాస్టర్‌ ప్లాన్‌లో జొప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ గత నెలలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నూతన జోన్‌ ఏర్పాటుపై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు ఉన్నట్లయితే తెలియజేయాలంంటూ, అందుకు గత నెల 10 నుంచి 24వ తేదీ వరకు గడువిచ్చింది. స్పందించిన 4,000 మందికిపైగా రాజధాని రైతులు తమకు అభ్యంతరాలున్నాయని సీఆర్‌డీఏకి సమాచారమిచ్చారు. కొందరు రాజధాని రైతులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా.. ఆర్‌-5పై అభ్యంతరాలకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. కాలపరిమితి ముగిసేవరకు ప్రభుత్వం ఓపిక పట్టడం లేదు. అన్నీ అభ్యంతరాలు వచ్చాక.. రైతుల నుంచి వివరణ కోరడం రివాజు. అది కూడా ఆ గ్రామానికి వెళ్లి రైతులను సమావేశపరచి అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కరోనా సాకుతో ఆడియో/వీడియో కాన్ఫరెన్స్‌లో మీ అభిప్రాయాలేంటో చెప్పాలని సీఆర్‌డీఏ ఉద్యోగులమంటూ రైతులకు ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌లు పెడుతున్నారు. ఇంకోవైపు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులిచ్చేందుకు ఊళ్లకు వెళ్తున్నారు. కరోనా పేరుతో ఫోన్లు చేస్తూ.. మళ్లీ ఎందుకు వస్తున్నారని అడిగితే.. ఫోన్లు చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని.. ఎవరు చేస్తున్నారో తెలియదని అధికారులు అంటున్నారు. ఫోన్లు చేసినవారిని మీరెవరు, సీఆర్‌డీఏలో మీ ఉద్యోగ హోదా ఏమిటని రైతులు ఎంతగా ప్రశ్నిస్తున్నా వారు చెప్పడం లేదు. సీఆర్‌డీఏ ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ చెప్పింది కాబట్టి అభిప్రాయాలు అడుగుతున్నామని అంటున్నారు. తమకు సంబంధించిన వివరాలను చెప్పకపోవడంతో రాజధాని రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించిన పలు అంశాల్లో అనుసరించిన వివాదాస్పద వైఖరితో రాజధాని రైతుల్లో సీఆర్‌డీఏ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు పారదర్శకతకు పాతరేసి.. వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌లు అంటుండడంతో రైతులు మరింతగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పైగా కరోనా వ్యాప్తితో అంతటా భయాందోళనలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో లేనిపోని హడావుడి చేయడంపై మండిపడుతున్నారు. అంతేగాకుండా.. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి, ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ దానికి ముందే ఇలా ప్రవర్తిస్తుండడమేమిటని ప్రశ్నిస్తున్నారు.