ఆయన... జగన్ ని అడ్డంగా బుక్ చేశారు

February 23, 2020

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో చోటుచేసుకున్న బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేస్తున్న వాదనలో లాజిక్ లేదనే చెప్పే దమ్ము ఏ ఒక్కరికీ లేకపోయిందనే చెప్పాలి. ప్రమాద సమయంలో బోటులో 93 మంది ఉన్నారని గురువారమే హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బోటు ఎక్కడుందో తెలిసినా, దానిని బయటకు తీసే వెసులుబాటు ఉన్నా కూడా... ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనన్న భయంతోనే జగన్ సర్కారు... ఆ పనిని పక్కనపెట్టేసిందని కూడా హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక బోటు ప్రమాదానికి మంత్రి అవంతి శ్రీనివాసరావే కారణమంటూ కూడా హర్ష చేసిన ఆరోపణలను అవంతి ఏదో ఖండించాలంటే ఖండించినట్టుగా ఉంది గానీ... హర్ష సంధించిన సూటి ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలే ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో హర్షకుమార్ చేసిన ఆరోపణలను ఆధారం చేసుకుని విచారణ చేస్తే... జగన్ సర్కారు ఈ వ్యవహారంలో నిండా మునిగిపోయినట్టేనన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

గురువారం తనదైన శైలి సంచలన ఆరోపణలు చేసిన హర్షకుమార్... బోటు ప్రమాదంపై అందరూ మరో కోణంలో ఆలోచించేలా చేసిందనే చెప్పాలి. గురువారం నాటి ఆరోపణలతోనే సరిపెట్టుకోని హర్షకుమార్... శుక్రవారం కూడా మీడియా ముందుకు వచ్చి మరింత సంచలన ఆరోపణలు చేశారు. గోదావరి నదిలో మునిగిపోయిన బోటును బయటకు తీయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసిన ప్రభుత్వం... తాను నిలదీయడం వల్లే మళ్లీ బోటును వెలికితీసే యత్నాలను కొనసాగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.  ప్రజలు, బాధితుల తరఫున తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని అన్నారు. చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల ప్రమాద ఘటనపై నాడు వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని హర్షకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ఘటనకు సంబంధించి ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని నాడు విమర్శలు చేశారని... మరి తాజా బోటు ప్రమాద ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ఆయన చాలా సూటిగానే ప్రశ్నించారు. కేవలం, సమీక్ష నిర్వహించి వెళ్లిపోతే సరిపోతుందా? కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెబితే సరిపోతుందా? అని సీఎం జగన్ ను కూడా హర్షకుమార్ నిలదీశారు.

ఇక గురువారం తాను చేసిన విమర్శలను మరోమారు ప్రస్తావించిన హర్షకుమార్... ఆ బోటులో 93 మంది లేకపోతే, పోలీసులు తీసిన ఫొటోలు ఎందుకు బయటపెట్టట్లేదు? అని ప్రశ్నించారు. బోటులో అసాంఘీక కార్యకలాపాలు సాగిస్తున్నారని తాను చేసిన ఆరోపణకు కూడా జగన్ సర్కారు నుంచి స్పష్టమైన సమాధానమే రాలేదని హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే... ప్రమాదానికి అసలు కారకులను రక్షించేందుకే యత్నాలు జరుగుతున్నట్లుగా కూడా అనుకోవాల్సి వస్తోందన్న కోణంలో హర్షకుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయాయి. హర్ష కుమార్ కోరుతున్నట్లుగా బోటు ప్రమాద సమయంలో తీసిన ఫొటోలను విడుదల చేస్తే తప్పనిసరిగా వైసీపీ సర్కారులోని కీలక వ్యక్తులే అడ్డంగా బుక్ అయిపోతారన్న వాదన కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. చూద్దాం... మరి ఏం జరుగుతుందో?