జగన్ బర్త్ డే... మంత్రులకు జనాల తిట్లు !!

February 25, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం తన జన్మదినాన్ని కాస్తంత గ్రాండ్ గానే జరుపుకున్నారు. శనివారం ఉదయమే తొలుత కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసిన జగన్... ఆ వెంటనే తన ఇంటికి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, సీఎం కార్యాలయ అధికారుల సమక్షంలో మరోమారు కేక్ కట్ చేశారు. ఇక జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. మొత్తంగా శనివారం జగన్ బర్త్ డే ను వైసీపీ నేతలు ఓ రేంజిలో జరుపుకున్నారు.

 

సరే... సీఎం బర్త్ డే అన్నాక... ఆ సందడే మామూలే అనుకోండి. అయితే బర్త్ డే రోజుకు ఓ రోజు ముందుగానే విషెస్ వెల్లువెత్తితే... కాస్త వెరైటీనే కదా. అది కూడా బర్త్ డే బాయ్ అందుబాటులోనే ఉన్నా... ఒక రోజు ముందుగానే విషెస్ చెప్పడం చూస్తుంటే... నిజంగానే అతే కదా. అలా కాకుండా బర్త్ డే నాడు ఆ బర్త్ డే బాయి... తమకు ఎక్కడ అవకాశం ఇవ్వడోనన్న చందానా... ఆయన అనుంగు అనుచరులంతా కట్ట కట్టుకుని గుంపులుగా వచ్చి ముందు రోజే బర్త్ డే విషెస్ చెప్పిన తీరు నిజంగానే ఆసక్తికరం అని చెప్పక తప్పదు.

 

సరే... జగన్ బర్త్ డేను పురస్కరించుకుని ఒక రోజు ముందుగా... అంటే శుక్రవారం సాయంత్రం ఏం జరిగిందన్న విషయంలోకి వెళ్లిపోదాం. జగన్ కేబినెట్ లోని కీలక మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు నిన్న సాయంత్రం జగన్ వద్దకు వెళ్లారు. బొకేలు అందించి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వీరి వెంట చాలా మంది పార్టీ కార్యకర్తలు, అధికారులు కూడా ఉన్నారు. అయినా జగన్ తన బర్త్ డే నాడు కూడా అందుబాటులోనే ఉంటున్నారు కదా... మరి ఈ అడ్వాన్స్ డ్ విషెస్ ఎందుకు? ఏమో మరి... బర్త్ డే నాడు జగన్ తమను దగ్గరకు రానివ్వరని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ... కేబినెట్ లో అందరికంటే కూడా జగన్ అత్యంత సన్నిహితులుగా మెలగుతున్న వీరే ఇలా అడ్వాన్స్ విషెస్ చెప్పడం నిజంగానే ఆసక్తికరమే కదా.