ఆంధ్రా- ​తెలంగాణ సరిహద్దుల వద్ద ఘోరమైన సీన్లు

June 04, 2020

ప్రత్యేక తెలంగాణలో కూడా కనపడని దృశ్యాలను లాక్ డౌన్ ఆవిష్కరింపజేసింది. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో ఒక్కో రోడ్డులో వేల మంది జనం ఆగిపోయారు. తెలంగాణ పాసులను ఆంధ్ర సర్కారు పట్టించుకోకపోగా... ఆంధ్ర సర్కారు మంజూరు చేసిన పాసులను తెలంగాణ పట్టంచుకోవడం లేదు. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్దామనుకుని బయలుదేరిన ప్రజల వేల సంఖ్యలో తిండి నీరు లేక సరిహద్దు చెక్ పోస్టుల్లో ఆగిపోయారు. 

హైవేల వెంబడి హోటళ్లన్నీ బంద్... దుకాణాలు లేవు. దీంతో తిండికి కూడా తిప్పలు పడుతున్నారు. పసికందులు ఉన్నవారు నరకం చూస్తున్నారు. ఆహారం దొరక్క పోలీసులు అనుమతించక... సరిహద్దుల్లో చిక్కుకపోయిన సీన్లు అందరినీ కలచివేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగినపుడు కూడా ఆంధ్రా వాళ్లను తెలంగాణలోకి రావద్దంటూ అడ్డుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటిది కరోనా ఆ దృశ్యాలను ఆవిష్కరించింది. 

లాక్ డౌన్ 2 అయ్యే వరకు ఓపిక పట్టిన ప్రజలు... మూడో లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక ఇది ముగిసేది ఎపుడో అని సొంత ఇంటికన్నా పోదాం కుటుంబంతో ఉందాం దొరికింది తిందాం అంటే... ప్రభుత్వాలు అత్యంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. వీరేమీ సొంతూళ్లకు వెళ్లినా... ఇంట్లోనే ఉంటారు. అవసరమైతే టెస్టులు, చెకప్ లు హోం క్వారంటైన్లు పెట్టొచ్చు. అంతేగాని సొంతూరికి రాకుండా ఆపడం అనేది మాత్రం అన్యాయం అంటున్నారు జనం. హైదరాబాదు నుంచి వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోజు ఓట్లేయడానికి సొంత డబ్బులతో అంత ఎగబడి వస్తే... ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తన బాధ్యత మరిచి కృతజ్జత లేకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అని ఏపీ ప్రజలు వాపోతున్నారు. వారిని సరిహద్దుల వద్ద అలాగే ఉంచితే యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలి. 

కొసమెరుపు: తెలంగాణ వైపు మాత్రం ఆగిపోయిన వారికి పోలీసులు కాస్త ఆహార ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆంధ్రా వైపు ఆగిపోయిన వారిని పోలీసులు పట్టించుకోవడం లేదు