హలో గూగుల్... నాకేం కావాలంటే... !

August 13, 2020

సందేహం ఏదైనా తీర్చేది మాత్రం గూగులమ్మే అన్న నమ్మకం ప్రజల్లో ఎంత ఉందన్న విషయం తాజా లాక్ డౌన్ లో మరోసారి స్పష్టమవుతోంది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వేళ.. తమకొచ్చే సందేహాలతో పాటు.. తమ అవసరాల్ని తీర్చేందుకు గూగులమ్మను ఆశ్రయించే వారికి కొదవ లేదు. లాక్ డౌన్ ను విధించిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏయే అంశాలను దేశ ప్రజలు గూగులమ్మను అడుగుతున్నారన్న విషయాన్ని చూస్తే ఆసక్తికర అంశాలు బోలెడన్ని కనిపిస్తాయి.
గూగుల్ సెర్చింగ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న అంశం ఏమిటో తెలుసా? మద్యం. లాక్ డౌన్ పుణ్యమా అని లిక్కర్ షాపులు బంద్ చేయటంతో మందుబాబు దీనికి సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట.

మద్యం ఎక్కడ దొరుకుతుంది? ఆన్ లైన్ లో మద్యాన్ని అమ్ముతున్నారా? బ్లాక్ లో ఎక్కడ అమ్ముతున్నారు? విస్కీ ఎలా తయారు చేస్తారు? తక్కువ ఆల్కాహాల్ ఉండేలా బీరును ఇంట్లో తయారు చేసుకునే విధానం ఏమిటి? లాంటి అంశాల్ని తెగ అడిగేస్తున్నారట. లిక్కర్ సమాచారం కోసం విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించే ప్రాంతాల్లో గోవా ముందుంది. దాని బాటలోనే పాండిచ్చేరి.. డయ్యూ అండ్ డామన్.. కర్ణాటక.. ఢిల్లీ.. అండమాన్ నికోబార్ దీవులు.. కేరళ.. సిక్కిం.. చండీగఢ్.. తెలంగాణ రాష్ట్రాలు టాప్ టెన్ లో ఉంటే.. ఏపీ మాత్రం పదిహేనో స్థానంలో నిలిచినట్లు గుర్తించారు.

మద్యాన్ని ఎలా తయారు చేయాలనే అంశాన్ని వెతికిన రాష్ట్రాల్లో మణిపూర్..జమ్ముకశ్మీర్.. ఉత్తరాఖండ్.. జార్ఖండ్.. అసోం.. ఏపీలు వరుస ఆరు స్థానాల్లో నిలిస్తే తెలంగాణ మాత్రం పదోస్థానంలో నిలిచింది. బీరు తయారీ విధానం ఎలా అన్న అంశాన్ని గూగుల్ లో వెతికిన రాష్ట్రాల్లో ఢిల్లీ.. కేరళ.. హర్యాణ.. కర్ణాటక.. మహారాష్ట్రలు టాప్ ఫైవ్ ప్లేసుల్లో నిలిచాయి. టాప్ టెన్ జాబితాలో రెండు తెలుగురాష్ట్రాలు ఉన్నాయి. లిక్కర్ సమాచారాన్ని మాత్రమే కాదు.. కరోనా వైరస్ కు సంబంధించిన అంశాలు.. దాని మందుగా చెప్పే హైడ్రాక్సీ క్లోరోక్విన్.. కరోనా లక్షణాలు.. ఆరోగ్య సేతు.. ఇండియా కోవిడ్ 19 ట్రాకర్.. లాంటి ఎన్నో అంశాల్ని కూడా తెగ వెతికేస్తున్నారని గూగులమ్మ చెబుతోంది.