హెల్ప‌ర్ ఫౌండేష‌న్ ఉదారత: వైద్యుల‌కు పీపీఈ కిట్లు

August 04, 2020

ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో తాము సైతం క్రియాశీల‌క పాత్ర పోషిస్తామ‌ని `హెల్పర్ ఫౌండేష‌న్‌` తెలిపింది. కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఎన్ఆర్ఐ స్వ‌చ్ఛంద సేవా సంస్థ `హెల్పర్ ఫౌండేష‌న్‌` నేడు గుంటూరు, విజ‌య‌వాడ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కావాల్సిన సుమారు 7 ల‌క్ష‌ల విలువైన టెస్టింగ్ కిట్లు, పీపీఈలు, టెస్టింగ్ బూత్ మ‌రియు ఇత‌ర వస్తువుల‌ను ఏపీ జూడాల‌కు అంద‌జేసింది. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పీపీఈ కిట్ల‌ను అందించారు. బే ఏరియాలో ఉన్న సంస్థ స్వ‌చ్ఛంద సేవా కింద ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.
ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌స్థాప‌క స‌భ్యులు కానూరి శేషుబాబు, వై.ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ అనూప్ నందనూరి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని రెడ్ జోన్ ఏరియాల‌కు త్వ‌ర‌లో మ‌రిన్ని కిట్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం త‌మ ఫౌండేష‌న్ కృషి చేస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ జూడాలు `హెల్పర్ ఫౌండేష‌న్‌`కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విదేశాల్లో స్థిర‌ప‌డిన ఎన్నారైలు క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో ముఖ్య‌మైన పీపీఈ కిట్ల‌ను అందించడం ద్వారా జూనియ‌ర్ డాక్ట‌ర్లు మ‌రింత మెరుగ్గా సేవ‌లు అందించ‌గ‌ల‌ర‌ని పేర్కొన్నారు.