పాపం సీఎస్‌!

August 06, 2020

వైసీపీ రంగుల్లో చిక్కుకుని విలవిల
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.
తప్పని తెలిసీ ఉత్తర్వులు జారీ
పంచాయతీ భవనాలకు అదనంగా
ఎర్రమట్టి రంగు వేయాలని నిర్దేశం
అక్షింతలు వేసిన హైకోర్టు
పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శిదీ ఇదే తీరు


జగన్‌ ప్రభుత్వానికి పట్టిన వైసీపీ రంగుల పిచ్చి.. రాష్ట్రప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి నీలం సాహ్నికి కూడా అంటుకున్నట్లు కనిపిస్తోంది. నియమ నిబంధనలను సీఎం దృష్టికి తీసుకెళ్లలేక.. తీసుకెళ్లినా ఆయన వినిపించుకోక.. ఆమె అడకత్తెరలో పోక చందంగా విలవిలలాడుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శిగా దేశమంతటా మంచి పేరు సాధించిన ఆమె.. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమవుతోంది. పాలన నిబంధనలు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న కొన్ని చర్యలు హైకోర్టు ఆగ్రహానికి గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ జెండాలోని మూడు రంగులు.. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వేయాలని గతంలోనే ఆమె ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడే దీనికి కారణం.

జాతీయ బిల్డింగ్‌ కోడ్‌కు విరుద్ధంగా ఉన్న ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఏ పార్టీ రంగులూ ప్రభుత్వ భవనాలకు వేయకూడదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పతాకాన్ని పోలిన రంగుల్ని తొలగించి, గతంలో తాము ఆదేశించిన మేరకు వేరే రంగులేశాకే స్థానిక ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన ‘లాక్‌డౌన’ ముగిసిన తర్వాత మూడు వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని గడువు విధించింది. అంతే ముఖ్యమంత్రి జగన్‌కు కోపం వచ్చింది. ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన తమకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని.. ఈ రాష్ట్రానికి తానే రాజునన్న భావనతో ఆయన ఉన్నారు. ఆయన ఆదేశంతో పంచాయతీరాజ్‌ శాఖ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా దాని తీరును తప్నుబట్టింది. హైకోర్టు తీర్పును సమర్థించింది.

అయినా సీఎస్‌ ఇటీవల మరో వివాదాస్పద ఉత్వర్వు ఇచ్చారు. హైకోర్టు తొలగించాలన్న వైసీపీ రంగులకు అదనంగా ఎర్రమట్టి రంగు వేయాలని జీవో 623ని జారీచేసేశారు. దానిని కూడా హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సీఎస్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా.. వైసీపీ రంగుల్ని పోలిన రంగులే వేయడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలని ఆమెను ఆదేశించింది. పూర్తి వివరణతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిర్దేశించింది. దీంతో సీఎస్‌ నుంచి పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల వరకు షాకయ్యారు.


ఉన్నత స్థాయి కమిటీ కూడా డూడూబసవన్నే
ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై సీఎస్‌ మార్గదర్శకాలు జారీచేయాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. దీంతో ఏప్రిల్‌ 2న ఆమె ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీకి సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ చైర్మన్‌గా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మెంబర్‌ కన్వీనర్‌గా, పురపాలక కార్యదర్శి జె.శ్యామలరావును సభ్యుడిగా నియమించి వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముగ్గురూ జగన్‌కు వీరవిధేయులే. వైసీపీ రంగులకు అదనంగా రెండు మూడు రంగులు వేస్తే సరిపోతుందని వారు నివేదిక ఇచ్చేశారు. ద్వివేది ఒకడుగు ముందుకేసి కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించి సీఎస్‌కు పంపారు. ఆమె ఏప్రిల్‌ 23న గ్రామ పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు ఏయే రంగులు వేయాలన్న దానిపై జీవో 623ను, మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఒక్కో శాఖ ఒక్కో రకంగా భవనాలకు రంగులు వేస్తోందని, జాతీయ బిల్డింగ్‌ కోడ్‌లో కూడా పలానా రంగు వేయాలన్న నిబంధనలు ఇప్పటికి లేవని అందులో పేర్కొన్నారు. ఆయా శాఖలు సాధించిన ప్రగతి ఆయా భవనాలకు వేసే రంగుల్లో ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు గ్రామాల్లో ఉంటున్నందున అక్కడ వేసే రంగులు గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఉండాలని... ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రాష్ట్రమైనందున ఇక్కడ రైతుల సంక్షేమం, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు అనుగుణంగా భవనాల రంగులు ఉండాలని చెప్పారు.

వైసీపీ రంగులకు సొంత భాష్యం చెప్పారు. గ్రామ పంచాయతీ భవనాలకు వేసే రంగు మట్టి, వ్యవసాయం, ఆక్వా, డైరీ తదితర రంగాలను ప్రతిబింబించే విధంగా ఉండాలంటూ భూమి, మట్టికి సంబంధించి టెర్రా కోటా (ఎర్రమట్టి) రంగును.. పంటలు, మొక్కలను ప్రతిబింబించేలా ఆకుపచ్చ.. నీటి వనరులు, ఆక్వా సంపదను ప్రతిబింబిస్తూ నీలం.. పాల ఉత్పత్తులు పెంచడం, పశువుల పెంపకానికి గుర్తుగా తెలుపు రంగు వేయాలని పేర్కొన్నారు. అంటే ఇప్పటికే ఆయా భవనాలకు వేసిన మూడు రంగులను అలాగే ఉంచి అదనంగా ఎర్రమట్టి రంగు వేయాలన్న మాట.

ఇప్పటికే ఈ రంగులకు రూ.2,150 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం.. మరో 810 కోట్ల వ్యయానికి పచ్చజెండా ఊపింది. ఈ మార్గదర్శకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అధికారులు కుక్కిన పేనులా తయారయ్యారు. సీఎస్‌ సాహ్ని ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తున్నారు. ఆమె స్థానంలో సీఎం కార్యాలయ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారాలన్నీ ఆయన హైజాక్‌ చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రశ్నించినందుకు అప్పటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆగమేఘాలపై జగన్‌ తొలగించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎల్వీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనేది జగద్విదితం. జగన్‌ సీఎం కాగానే ఎల్వీని ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శిగా కొనసాగించారు. ద్వివేదికి కీలకమైన పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించారు. ఎందుకంటే స్థానిక ఎన్నికల సమయంలో మళ్లీ ఆయన ఉపయోగపడతారనే. తనపై ఉంచిన నమ్మకాన్ని ఆయన బాగానే నిలబెట్టుకున్నారు. నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను సంప్రదించకుండానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ఇచ్చారు. కరోనా కారణంగా రమేశ్‌కుమార్‌ ఎన్నికలను వాయిదావేయడంతో జగన్‌ మండిపడ్డారు. సీఎస్‌పై ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయించారు.

వాయిదా నిర్ణయాన్ని మార్చుకోవాలని.. ఎన్నికలు తక్షణం జరపాలని ఆమె లేఖ రాశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని రమేశ్‌కుమార్‌ ఆమెకు జవాబిచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించాలని సుతిమెత్తగా సూచించారు. ఆ తర్వాత ద్వివేది పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్‌ తయారుచేసి రమేశ్‌కుమార్‌ను తొలగించడం వేరే విషయం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో ఉన్నతాధికారులు కూడా ఫక్తు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. వారిలో స్వామిభక్తి అణువణువునా తొణకిసలాడుతోన్న వైనం తేటతెల్లమవుతోంది. వీటికి కోర్టులే అడ్డుకట్ట వేయాలి. లేదంటే ప్రజల గోడు పట్టించుకునే నాథుడే ఉండడు.