ముస్తఫా పార్టీలో అంబటితో పాటు ఉన్నతాధికారులు

May 28, 2020

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మార్చి 22న జనతా కర్ఫ్యూ ముందు నుంచే కరోనాపై అవగాహన పెంచుతూ కార్యక్రమాలు చేపడుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటివి వాయిదా వేసుకోవాలని...వీలైనంత తక్కువ మందితో నిర్వహించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. అయితే, ఈ సూచనలు పాటించకుండా కొందరు వ్యక్తులు తమతోపాటు తోటివారికి కరోనా వ్యాప్తి చేస్తున్నారు. తాజాగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది ఇచ్చిన విందు ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది.

మార్చి 22న ముస్తఫా బావమరిది ఇచ్చిన విందుకు పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది. తాజాగా ముస్తఫా బావమరిది, అతడి భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో గుంటూరు నగరం ఉలిక్కిపడింది. ఆ కుటుంబంలోని మిగతా నలుగురికి సంబంధించిన టెస్టు రిజల్ట్స్ రావాలని తెలుస్తోంది. మరోవైపు, ఎమ్మెల్యే ముస్తఫాతోపాటు మరో 15 మంది కుటుంబసభ్యులను చిలకలూరిపేట సమీపంలోకి కాటూరు ఆసుపత్రిలోని క్వారంటైన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఆ విందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, డాక్టర్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

ఆ విందుకు తానుకూడా హాజరైనట్లు వచ్చిన వార్తలను అంబటి రాంబాబు ఖండించారు. అయితే, ఆ విందుకు గుంటూరు నగరంలో ప్రముఖ డాక్టర్లు, పారిశ్రామిక వేత్తల, బడాబాబులతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కూడా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నారు. ఆ విందుకు హాజరైన 500 మందిలో 85 మంది క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గుంటూరులో హై అలర్ట్ ప్రకటించారని, గుంటూరులోని మంగళదాస్ నగర్, అరుంధతి నగర్, ఆర్టీసీ కాలనీ, అంబేడ్కర్ నగర్, సీతా నగర్, నెహ్రూనగర్, వాసవి నగర్ లను రెడ్ జోన్ లుగా ప్రకటించారు. బాధ్యతగా ఉండవలసిన అంబటి వంటి ప్రజా ప్రతినిధులు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజలను చైతన్య పరచవలసిన  అధికార పార్టీ ఎమ్మెల్యేలు...ఇలా పార్టీలకు వెళ్లడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీరి వల్ల గుంటూరులో కరోనా మరింత వ్యాప్తి చెందితే దానికి బాధ్యత వారిదేనని విమర్శిస్తున్నారు. బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యం వహించిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా క్వారంటైన్ లోకి వెళ్లాల్సిందేనని అంటున్నారు.