మంగళగిరిలో రాజధాని.. కర్నూలు హైకోర్టు

July 12, 2020

ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం ఖాయమన్న ప్రచారం రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ త్వరలో నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో మంగళగిరిని రాజధాని చేయాలని సూచిస్తూ నివేదిక తయారవుతోందంటూ ఒక ప్రచారం మొదలైంది.
అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి సీఎం జగన్ వ్యూహం పన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వం పునాదులేసిన అమరావతిని జగన్ నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు. నిపుణుల కమిటీ నివేదిక జగన్ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని, శాసనసభను మంగళగిరికి తరలించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైకోర్టుకు మాత్రం కర్నూలుకు తరలిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పి అధికార వికేంద్రీకరణ చేయాలనే జగన్ ఆలోచనలో భాగంగానే అదంతా జరుగుతుందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతిలో నిర్మాణం పనులన్నీ ఆగిపోయాయని అంటున్నారు. ఏపి రాజధానిని దోమకొండకు తరలిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, అందుకు విరుద్ధంగా రాజధానిని మంగళగిరిలో పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా రాజధాని విషయంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజులుగా ఏదో ఒక అంశం లేవనెత్తుతూ అమరావతి నుంచి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న సంకేతాలిస్తూ వస్తున్నారు. దానిని సీఎం కూడా ఏనాడూ ఖండించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పుడు నివేదిక ఇచ్చే పనిలో ఉంది. ఆ నివేదికలో ఏముందో కానీ రాజధానిని మంగళగిరికి మారుస్తారన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. దాంతో మంగళగిరి ప్రాంతంలో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల వ్యాపారుల్లో సందడి మొదలైంది.