వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

June 06, 2020

కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషను ఈరోజు విచారణకు వచ్చింది. దీనిని విచారించిన కోర్టు ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా (నగరి), విడదల రజని (చిలకలూరిపేట), మధుసూదన్ రెడ్డి (శ్రీకాళహస్తి), సంజీవయ్య (సూళ్లూరు పేట), వెంకట గౌడ్ (పలమనేరు) లు ఉన్నారు.

కరోనా వ్యాప్తి ప్రమాదకరమైన స్థాయిలో ఉందని తెలిసి... లాక్ డౌన్ కి విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు వ్యవహరించి అది పెరగడానికి కారణమని... వీరి వైఖరి వల్ల ఆయా జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయని న్యాయవాది ఇంద్రనీల్ వాదించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న ధర్మాసనం లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు డీజీపీని హైకోర్టు ఆదేశించింది .

గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సభలు సమావేశాలు నిర్వహించారని... పేదలకు ఉచిత సరుకులు పంపిణీ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించారని కోర్టుకు వినిపించారు. ఎక్కడా సామాజిక దూరం పాటించడం లేదని, మాస్కులు కూడా నాయకులు తప్ప ఎవరి వద్ద లేనవన్నారు. ప్రతి చోటా ప్రతి విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది తెలిపారు. 

ఇదిలా ఉండగా... ప్రభుత్వం ఎన్నిసంఘటనలు జరిగినా ఎవరి మీదా కేసు నమోదు చేయలేదు. మరి హైకోర్టు చెప్పిన తర్వాత ఏం చేస్తుందో చూడాలి.