ఎల్జీ పాలిమర్స్ భారీ షాక్... జగనన్న అడ్డంగా ఇరుక్కున్నారే!

August 08, 2020

ఎల్జీ పాలిమర్స్ కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీచేసింది. రేపటి నుంచి ఆ కంపెనీలోకి చీమ కూడా వెల్లడానికి వీల్లేదంటూ గవర్నమెంటును ఆదేశించింది.

ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్లు అందరూ తమ పాస్ పోర్టులను కోర్టుకు స్వాధీనం చేయాలని మరో సంచలన ఆదేశం ఇచ్చింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వెంటనే గవర్నమెంటే చేయాల్సిన ఈ పనిని సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు స్పందించింది.

వాస్తవానికి ఏపీ పోలీసులు గాని, ఏపీ ప్రభుత్వం గాని కంపెనీకి వ్యతిరేకంగా ఒక్క మాట అనలేదు. పైగా స్వయంగా ముఖ్యమంత్రే ఆ కంపెనీ త్వరలో తిరిగి ప్రారంభం అవుతుంది. అక్కడే ఉద్యోగాలిప్పిస్తాం అని విచిత్రమైన హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒక్కరు కూడా కంపెనీ నొచ్చుకునేలా మాట్లాడలేదు. బహుశా అందుకేనేమో ఏపీలో బోటు ప్రమాదంలో అన్యాయంగా ప్రాణాలు పోయిన వారిని చాలా తక్కువ పరిహారం ఇచ్చిన ఏపీ సర్కారు ఇక్కడ మృతులకు ఏకంగా మనిషికి కోటి ఇచ్చింది.

ఇక కోర్టు తాజా ఆదేశాలతో కంపెనీ విషయవాయువు బాధిత గ్రామాల్లో సంబరాలు జరుగుతున్నాయి. కంపెనీని హైకోర్టు సీజ్ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆయా గ్రామాల్లో పెద్ద సందడి నెలకొంది. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండగా... దాని చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా ఈ విషవాయువు బారిన పడ్డారు.

ప్రమాద ఘటనపై ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. బాధితులకు కంపెనీ తరఫున సారీ చెప్పలేదు. సాయం ప్రకటించలేదు. పైగా హైకోర్టు, ఎన్జీటీ విచారణకు ఆదేశిస్తూ విచారణ ఆపమంటూ జగన్ సొంత కేసులు వాదించే లాయర్ ముకుల్ రోహ్ తగిని వెంటేసుకుని వెళ్లి సుప్రీంకోర్టుకు ఎక్కారు. అక్కడ చీవాట్లు పెట్టి పంపింది కోర్టు. 

తాజాగా హైకోర్టు తనంతట తానే బాధితుల తరఫున నిలబడి వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఈరోజు కోర్టులో ఒక కీలక ప్రశ్న సంధించింది హైకోర్టు. అసలు స్టైరీన్ తరలించడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించింది. దీంతో జగన్ సర్కారు ఇరుకున పడింది.

ఎందుకంటే ప్రమాదం జరిగిక ఒక మిల్లీ మీటరు కూడా స్టైరీన్ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అనడం, ఆ తర్వాత మంత్రి కన్నబాబు మీడియా సమావేశంలో ఇప్పటికే చాలా స్టైరీన్ తరలించారు, మిగతాది కూడా త్వరగా తరలిస్తామన్నారు, తీసుకెళ్లమని చెప్పాం అంటూ... ఏదో ప్రజలకు మేలు చేస్తున్న కవరింగ్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. ఇపుడు సరిగ్గా హైకోర్టు అదే ప్రశ్న వేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.