హైకోర్టు పవరేంటో... వైసీపీకి అర్థమైన వేళ...

June 02, 2020

ఒకేఒక్క పదం...

హైకోర్టు వేసిన ఒక ప్రశ్న...

వైసీపీకి, ఏపీ ముఖ్యమంత్రికి ఈరోజు చలిజ్వరం తెప్పించింది. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో ఒక పిటిషను దాఖలైన సంగతి తెలిసిందే. అది ఈరోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. లాక్ డౌన్ ను అమలు చేయడంలో శ్రద్ధచూపాల్సిన ఎమ్మెల్యేలే ఉల్లంఘించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది విచిత్రమైన వాదన చూసి అసహనానికి గురైన కోర్టు ఒకానొక దశలో ‘‘ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పండి‘‘? అంటూ ఒక ప్రశ్న వేసింది.

అంతే ఈ ప్రశ్నతో అడ్వకేట్ జనరల్ కు జ్వరమొచ్చినంత పనైంది. పొరపాటన హైకోర్టు ఆ పని చేస్తే ఇక ఏజీ ముఖ్యమంత్రి ఆగ్రహానికి లోనుకాక తప్పదు. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుకు ఆయన ఏం చెప్పారో తెలుసా?

లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా అలా జరిగిందని, దయచేసి ప్రభుత్వం తరఫు వివరాలు అందించడానికి కొంచెం సమయం ఇవ్వమని విన్నవించారు. దీంతో హైకోర్టు వారం సమయం ఇస్తూ కేసును వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా జనాలు గుమిగూడడానికి వారు కారణం అయ్యారు. ఇందులో రోజా, శ్రీదేవి, రజని తదితర మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం.

లాయర్ ఇంద్రనీల్ పిటిషను మేరకు ఈ కేసును హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏది ఏమైనా ఇప్పటికే సీబీఐ తలనొప్పులతో పార్టీ పెద్దలు సతమతం అవుతున్న వేళ... ఇక ఎమ్మెల్యేలు ఎక్కడ ఇరుక్కుంటారో అని హైకోర్టు వ్యాఖ్య గురించి తెలియగానే వైసీపీ జడుసుకుంది.