చంద్రబాబు అరెస్టు...ఏపీ డీజీపీకి షాక్

June 04, 2020

ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో మొన్నటి విశాఖపట్నం ఘటనతో మరోసారి స్పష్టమైంది. అన్ని అనుమతులతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబును కుట్రపూరితంగా వైసీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జగన్ అడ్డుకున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. గతంలో తనకు విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన అవమానానికి జగన్ పగ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ను అడ్డుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని అడిగిన చంద్రబాబుకు...విశాఖ పోలీసులు ఇచ్చిన వివరణ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

crpc 151 సెక్షన్ ప్రకారం చంద్రబాబు రక్షణ నిమిత్తం ఆయనను అరెస్ట్ చేస్తున్నామని విశాఖ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆ సెక్షన్ ప్రకారం చంద్రబాబు రక్షణ కోసం ఆయనను, ఆయన అనుచరులను అరెస్టు చేస్తున్నామని లిఖిత పూర్వకంగా ఓ స్లిప్ రాసిచ్చారు.  అరెస్టు అయ్యేందుకు తమకు సహకరించాలని కూడా విశాఖ పోలీసులు కోరారు. తాజాగా,  ఆ స్లిప్పు వ్యవహారం ఇప్పుడు కోర్టు దృష్టికి రావడంతో విశాఖ పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. 151 crpc పై వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ సెక్షన్ ప్రకారం చంద్రబాబును ముందుస్తుగా ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని కోరినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విశాఖ పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి crpc section 151 గురించి వివరంగా తెలుసుకుని రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ సెక్షన్ లో ఉన్న అన్ని క్షుణ్ణంగా చదువుకొని రావాలి అంటూ చమత్కరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చంద్రబాబును అడ్డుకోవాలి కాబట్టి ఏదో ఒక సెక్షన్ పేరు చెప్పి తప్పించుకోవాలని పోలీసులు భావించారని, కానీ ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టు దృష్టికి వెళ్లడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటున్నారు అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా పోలీసులు చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని, అంతేగాని ప్రభుత్వం చెప్పిందని తానా అంటే తందానా అన్నట్లు గా వ్యవహరిస్తే ఇదేవిధంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో అయినా ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని నెటిజన్లు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.