సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు అక్షింత‌లు!

February 26, 2020

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఏక‌పక్ష నిర్ణ‌యంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని త‌ర‌లింపుపై రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. అమ‌రావ‌తి రైతుల ఆవేద‌న విన్న హైకోర్టు ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలను తరలించొద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. ప్ర‌తిప‌క్షాలు, విశ్లేష‌కుల మాట‌ల‌ను పెడ చెవిన బెట్టిన జ‌గ‌న్...తాజాగా హైకోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించారు. త‌న‌కు తానే రాజు..మంత్రి అని భావించిన జ‌గ‌న్....అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో జారీ చేయించారు. ఈ జీవోపై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు జ‌గ‌న్‌కు అక్షింతలు వేసింది.

ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలను తరలించొద్దంటూ తాము జారీ చేసిన ఆదేశాల‌ను బేఖాత‌రు చేయ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ కార్యాల‌యాల‌ను ఎందుకు తరలిస్తున్నారని ప్ర‌భుత్వాన్ని నిలదీసింది. రాజధాని త‌ర‌లింపు అంశంపై ప‌లు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, ఈ స‌మ‌యంలో కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. కార్యాలయాల నిర్వహణ సరిగా లేకుంటే కొత్త నిర్మాణాలను చేపట్టవచ్చు కదా? అని హైకోర్టు చుర‌క‌లంటించింది. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించవ‌ద్దంటూ అమ‌రావ‌తి రైతులు తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఏపీ అభివృద్ధి కోసం త‌మ పొలాల‌ను త్యాగం చేశామ‌ని, ఇపుడు హ‌ఠాత్తుగా రాజ‌ధాని త‌ర‌లిస్తే త‌మ భ‌విష్య‌త్తు అంధ‌కారం అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే వారు హైకోర్టును ఆశ్ర‌యించారు.