హైకోర్టు దెబ్బ - రాజధానికి బ్రేక్

February 17, 2020

అధికారం ఉంటే నచ్చింది చేయాలనే ఆలోచన రావచ్చు. ఇష్టానుసారం చేయగలమనే కాన్ఫిడెన్స్ తలకెక్కొచ్చు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి తావే లేదు.  అహంకారపు వేగానికి అవసరమైన స్పీడ్ బ్రేకర్లను కూడా ప్రజాస్వామ్యం ఏర్పాటుచేసింది. చట్టసభ సుప్రీం కాదు. ప్రజాస్వామ్యంలోని 3 భాగాల్లో ఒకటి మాత్రమే. అదే సుప్రీం అయ్యుంటే... మంత్రులు, ముఖ్యమంత్రులు జైలుకు పోయేవారే కాదు. సహారా వంటి భారీ మోసాలు చేసిన వారు నాయకులను అడ్డం పెట్టుకుని తమను తాము కాపాడుకునేవారు. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ప్రజామోదం లేని రాజధాని మార్పును తనకు నచ్చినట్టు చేయాలనుకుని జగన్ దాటింది కేవలం ఒకట్రెండు నిచ్చెన మెట్లు. ఇంకా చాలా దాటాల్సినవి ఉన్నాయి. 

మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముఖ్యమంత్రి జగన్ కు ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. దాంతో దానిపై ఈరోజు అసెంబ్లీ తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. అధ్యక్షా దేశంలో 22 రాష్ట్రాలకు లేని మండలి మనకెందుకు అధ్యక్షా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. అయితే...అప్పటికే ఆగ్రహంలో ఉన్న జగన్ కి  మధ్యాహ్నం దాటాక మరోషాక్ తగిలింది. 37 మంది రైతులు దాఖలు చేసిన పిటిషనుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు  రాష్ట్ర ప్రజలు అందరికీ సంబంధించినది కావడంతో హైకోర్టు దీనికోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. ఈ ధర్మాసనం కేసును విచారించి... మండలిలో బిల్లు ఎక్కడిదాకా వచ్చిందో ఆరా తీసింది. సెలెక్ట్ కమిటీ దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది. అంతేకాదు... కేసును ఫిబ్రవరి 26కు వాయిదావేస్తూ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. 

కోర్టు తీర్పు వెలువడే వరకు కార్యాలయాలు తరలించకూడదని, తరలిస్తే దానికి ప్రభుత్వ అధినేతలు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొంది. అంతేకాదు... ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఏ నిర్ణయం అయినా కోర్టు తీర్పు అనంతరమే చేపట్టాలని పేర్కొంది. ఇదిలా ఉండగా... వైసీపీ కీలక నేత, పార్టీలో నెం.2 అయిన విజయసాయిరెడ్డి విచారణలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో ఆయన మొహం వాడిపోయింది. ఈ తీర్పు తెలిసిన అనంతరం జగన్ తీవ్రంగా అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.