హైకోర్టు షాక్ తో దొరకు దిమ్మతిరిగిందా?

September 17, 2019

తెలంగాణలో ఎవరూ తనను ప్రశ్నించే వారు లేకుండా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయించారు. అయితే వాళ్లంతా ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా పార్టీ ఫిరాయిస్తూ వచ్చారు. కాబట్టి ఈ విలీనం చెల్లదని కాంగ్రెస్ నిలదీసింది. ధర్నాలు చేస్తోంది. భట్టి విక్రమార్క నిరాహార దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ తన పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్తూ హైకోర్టుకు వెళ్లింది.
కాంగ్రెస్ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమిక వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రికి, స్పీకర్ కు షాక్ ఇచ్చింది.
మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పార్టీ మారిన సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌ విడివిడిగా హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తే... వారిని అవమానిస్తూ టీఆర్ఎస్ వలసలను ప్రోత్సహించింది. ప్రలోభాలతో వారిని లాక్కుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హీనంగా స్పందించారు. గతంలో కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి... మేము ఇపుడు తప్పు చేస్తున్నాం, వలసలు ప్రోత్సహించాం అన్నట్టు మాట్లాడారు. ప్రజల తీర్పును అగౌరవపరచడం వల్ల ప్రజాస్వామ్యానికి తీరని చేటు అది.