అమరావతి: హై పవర్ కమిటీ ఫస్ట్ మీటింగ్ సారాంశం ఇదే !!

February 25, 2020

ఇంకే ముంది... జగన్ చెప్పింది రాయడానికి ఇంకో కమిటీ సిద్ధమైంది. 

ఆర్నెల్ల క్రితమే సిద్ధమైన రాజధానికి... ఈ కమిటీలు లాంఛనాలు మాత్రమే.

అంతా సెట్ చేసుకున్నాక జనాల్ని ప్రిపేర్ చేసే కమిటీలే ఇవన్నీ. 

లేకపోతే పొల్లు పోకుండా ఒకే మాట మూడు కమిటీలు చెప్పడం ఏంటి? పోనీ అందులో పాయింట్లేమన్నా వాలిడా అంటే కాదు. దేనికీ శాస్త్రీయంగా సూత్రీకరణ చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయాన్ని రైట్ అనాలి అనే ఏకైక లక్ష్యంతో అలా ముందుకు పోతున్నాయంతే. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన హైపవర్ కమిటీ కూడా జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన విభాగాల వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని అభిప్రాయపడింది. ఇదే రిపోర్టు వెలువడతుందని అందరూ ఊహించిందే. 

అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. అన్ని ప్రాంతాలను గౌరవించడం ఇందులో ఎక్కడుందో తెలియాలి. తప్పు చేసిన వాడికి మాత్రమే అవసరమయ్యే కోర్టు రాయలసీమకు ఇచ్చి ప్రతిఊరికి అవసరమైన సచివాలయం అంతా ఉత్తరాంధ్రకు ఇచ్చినపుడే అన్ని ప్రాంతాలపై గౌరవం లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమావేశమైన హైపవర్ కమిటీ...జై జగన్ అనేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన హైపవర్ కమిటీ తొలి సమావేశం నిర్వహించి... తమ దారి ఏ దిశనో చెప్పేసింది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకునే విధంగా రెండు కమిటీ నివేదికలు పరిశీలించి చర్చించామని బుగ్గన చెప్పారు. 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశం ఇది మొదటిది. ఇంకొన్ని సమావేశాలుంటాయి. వాటి అనంతరం చివరి నిర్ణయం ప్రకటిస్తారు. ఏపీలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధి వేగంగా ఉంటుందని చెప్పింది 

ఇక అమరావతి విషయానికి వస్తే... నిరసనలు చల్లార్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించినట్టు అర్థమవుతోంది. అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పెడతారట.  మరి అమరావతి రైతులు దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.