లోక్‌స‌భ‌కు ఓటేస్తున్నారా... హిస్ట‌రీలో హైలెట్స్ ఇవే

June 01, 2020
CTYPE html>
భార‌త పార్ల‌మెంటు అంటే... రాష్ట్రప‌తి-లోక్‌స‌భ‌-రాజ్య‌స‌భ‌. ఈ మూడు క‌లిసి నిర్ణ‌యిస్తే ఈ దేశంలో ఒక చ‌ట్టం రూపొందుతుంది. అయితే, ఇందులో లోక్‌స‌భ‌ను మాత్ర‌మే ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా ఎన్నుకుంటారు. రాష్ట్రప‌తిని, రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారు నిర్ణ‌యిస్తారు. అంటే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో పునాది రాళ్లు వేసేది ఓట‌రే. మ‌రోసారి తాజాగా ఇపుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. మ‌రి లోక్‌స‌భ‌కు ప్ర‌తినిధుల‌ను మ‌నం ఎన్నుకుంటున్న‌పుడు దానికి సంబంధించి గ‌తంలో జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలుసుకుందామా? 
 
భారత రాజ్యాంగ నిర్మాణం జరగకముందు..
 
 
భారత రాజ్యాంగ పరిషత్‌ (1946-49)
 
పరోక్షంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉన్న భారత రాజ్యాంగ పరిషత్‌.. సుమారు మూడు సంవత్సరాల పాటు కొనసాగింది. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ విధానాన్ని అనుసరించారు. 1947లో భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి పార్లమెంటుగానూ ఇది కొనసాగింది. ప్రస్తుతం ఉన్న ఓటు హక్కు వినియోగ పద్ధతిలా కాకుండా, కొద్ది మందికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే, ముస్లింలు, సిక్కులు మైనార్టీలుగా లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించారు. భారత రాజ్యాంగ నిర్మాణం జరిగేవరకు ఈ సభ కొనసాగింది.. 1947 నుంచి 1952 వరకు జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు.
 
మొదటి లోక్‌సభ (1952-57)
గణతంత్ర భారత్‌లో ఏర్పడిన మొట్టమొదటి లోక్‌సభ ఇది. 489 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)‌ పార్టీ 364 సీట్లు గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మినహాయిస్తే రెండు పార్టీలకు మాత్రమే రెండంకెల సీట్లు వచ్చాయి. సీపీఐకి 16, సోషలిస్ట్‌ పార్టీకి 12 సీట్లు దక్కాయి. భారతీయ జన సంఘ్‌ (బీజేఎస్‌)కి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌కి 45 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ తర్వాత లోక్‌సభలో స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక మంది ఉన్నారు. జవహరల్ లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
 
రెండవ లోక్‌సభ (1957-62):
రెండవ లోక్‌సభలో 494 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్‌కి 371 సీట్లు దక్కాయి. సీపీఐకి 27, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ (పీఎస్పీ)కి 19 సీట్లు దక్కాయి. భారతీయ జన సంఘ్‌కి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ తర్వాత లోక్‌సభలో మరోసారి స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక మంది ఉన్నారు. కాంగ్రెస్‌కి 48 శాతం ఓట్లు వచ్చాయి. నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. రెండవ లోక్‌సభలో అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరూ లేరు.
 
ఇందిరా గాంధీ ప్రవేశం...
 
మూడవ లోక్‌సభ (1962-67):
మూడవ లోక్‌సభలో కూడా 494 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్‌కి 361 సీట్లు దక్కాయి. సీపీఐ, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, భారతీయ జన సంఘ్‌, స్వతంత్ర పార్టీలకు రెండంకెల సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్ల శాతం గత ఎన్నికలతో పోల్చితే 48 నుంచి 45 శాతానికి పడిపోయింది. జవహర్‌ లాల్‌ నెహ్రూ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన మృతి చెందిన తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 19 నెలల పాటు లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతి చెందిన తర్వాత 1966లో ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు.
 
నాలుగో లోక్‌సభ (1967-70):
ఓటర్లు 25 కోట్లకు చేరారు. ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నాలుగోసారి విజయం సాధించింది. మొత్తం 520 స్థానాల్లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ 283 స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. రాజగోపాల చారికి చెందిన స్వతంత్ర పార్టీ 44 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇందిరా గాంధీ రెండోసారి ప్రధాని అయ్యారు.
 
ఐదో లోక్‌సభ (1971-77):
ఇందిరా గాంధీని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. 518 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందిరా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ (ఆర్‌) 352 సీట్లు గెలవగా, మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని  కాంగ్రెస్‌ 16 సీట్లు గెలుచుకుంది. ఇందిరా గాంధీ మూడవ సారి ప్రధానమంత్రి అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర స్థితి విధించిన తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి.
 
రాజకీయాల్లో పెను మార్పులకు నాంది..
 
ఆరో లోక్‌సభ (1977-79):
అత్యవసర స్థితి తర్వాత నిర్వహించిన మొదటి ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. భారతీయ లోక్‌దళ్, జన సంఘ్‌, పాత కాంగ్రెస్‌ కలిసి ఈ జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. భారతీయ లోక్‌దళ్ ఎన్నికల గుర్తుపై జనతా పార్టీ పోటీ చేసింది. 542 స్థానాలకు ఎన్నికలు జరగగా 295 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ 154 స్థానాలకే పరిమితమైంది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి అయ్యారు. 1979లో ఈ కూటమి నుంచి కొన్ని పార్టీలు వైదొలగడంతో చరణ్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
 
ఏడో లోక్‌సభ (1980-84) 
జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడంతో ఇందిరా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. 529 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 353 సీట్లలో ఆమె పార్టీ గెలుపొందింది. జనతా కూటమి సభ్యులు రాణించలేకపోయారు.
 
 
రాజీవ్‌ గాంధీ నాయకత్వంలో..
 
ఎనిమిదో లోక్‌సభ (1984-89):
1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశంలో ఘర్షణలు చెలరేగాయి. ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ ప్రధానిగా నియమితులయ్యారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌  అఖండ విజయం సాధించింది. 514 స్థానాలకు గానూ 404 సీట్లు గెలుచుకుంది. భాజపాకు 2 సీట్లు (ఒకటి గుజరాత్‌ నుంచి మరొకటి తెలంగాణ నుంచి) దక్కాయి. రాజీవ్‌ గాంధీ తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 
తొమ్మిదో లోక్‌సభ (1989-91):
బోఫొర్స్‌ కుంభకోణం, ఎల్‌టీటీఈ సమస్యతో పాటు పలు అంశాలు కాంగ్రెస్‌కి ప్రతికూలంగా మారాయి. ఈ ఎన్నికల్లో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడింది. 529 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌కి 197, జనతాదళ్‌కి 143, భాజపాకు 85 సీట్లు దక్కాయి. జనతాదళ్‌ ఆధ్వర్యంలో ఇతర పార్టీలతో నేషనల్ ఫ్రంట్‌ ఏర్పడింది. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్‌) ప్రధాని అయ్యారు. అయోధ్య పరిణామాల పర్యవసానంగా వీపీ సింగ్‌.. ప్రధాని పదవి నుంచి తొలగాల్సి వచ్చింది. 1990లో కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌.. ప్రధాని అయ్యారు. 
 
పదో లోక్‌సభ (1991-96):
1991లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. అలాగే, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారి కోసం ఏర్పాటైన మండల్‌ కమిషన్‌ ప్రతిపాదనలపై చెలరేగిన నిరసనలు, అయోధ్యలో రామ జన్మభూమి-బాబ్రీ మసీద్‌... విషయాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ.. పూర్తి మెజార్టీని పొందలేకపోయింది. 521 స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 232 సీట్లు, భాజపాకు 120 సీట్లు దక్కాయి. ఏ కూటమికి, పార్టీకి మెజార్టీ లేకపోవడంతో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దక్షిణ భారత్‌కు చెందిన పీవీ నరసింహరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడింది. ప్రధానిగా ఆయన అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశంపై పెను ప్రభావం చూపించాయి.
 
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ప్రారంభం..
 
11వ లోక్‌సభ (1996-98):
భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో రాణించలేకపోయింది. హంగ్‌ ఏర్పడింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 140 సీట్లు మాత్రమే సాధించగలిగింది. భారతీయ జనతా పార్టీ 161, జనతా దళ్‌ 46 సాధించాయి. ఈ ఎన్నికలతో దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ప్రారంభమైంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 129 సీట్లు సాధించాయి. తెలుగు దేశం పార్టీ, శివసేన, డీఎంకే కీలకంగా వ్యవహరించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి రాష్ట్రపతి... భాజపాకు అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ కూటమిని ఏర్పాటు ప్రయత్నాలు చేసింది. అయితే, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. 13 రోజుల్లోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు రాలేదు. అయితే, బయటి నుంచి జనతా దళ్‌తో పాటు ఇతర పార్టీలకు మద్దతు తెలిపింది.. ‘యునైటెడ్ ఫ్రంట్‌’ ఏర్పడింది. హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. 18 నెలల అనంతరం ఐకే గుజ్రాల్‌ ప్రధాని అయ్యారు. 
 
12వ లోక్‌సభ (1998-99):
543 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో భాజపా 182 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కి 141 సీట్లు దక్కాయి. ఇతర పార్టీలు 101 సీట్లు గెలుచుకున్నాయి. భాజపా ఆధ్వర్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలు ఇందులో చేరాయి. వాజ్‌పేయీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 13 నెలల అనంతరం అన్నాడీఎంకే ఆయనకు మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వ పడిపోయింది. వాజ్‌పేయీ రాజీనామా చేశారు. పోఖ్రాన్‌లో భారత్ చేపట్టిన అణ్వస్త్ర పరీక్షలు, కార్గిల్‌ యుద్ధం ఆ సమయంలోనే జరిగాయి. 
 
13వ లోక్‌సభ (1999-2004):
కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించడంతో భాజపా ప్రభుత్వానికి ప్రజాదరణ పెరిగింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 182 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌కి కేవలం 114 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 158 సీట్లు దక్కించుకున్నాయి. ఎన్డీఏ కూటమితో  భాజపాతో సహా 270 సీట్లు సాధించాయి. వాజ్‌పేయీ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగింది.
 
యూపీఏ హవా..
 
14వ లోక్‌సభ (2004-09)
ఈ ఎన్నికల్లో భాజపా కేవలం 138 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌ పార్టీకి 145 సీట్లు దక్కాయి. ప్రాంతీయ పార్టీలు మరోసారి సత్తా చాటాయి. అన్ని కలిపి 159 స్థానాల్లో గెలుపొందాయి. యూపీఏ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పలు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ‘విదేశీయురాలు’ అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని పదవిని చేపట్టడానికి సోనియా గాంధీ నిరాకరించారు. ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.
 
15వ లోక్‌సభ (2009-14)
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తాము ఇచ్చిన పలు హామీలను అమలు చేసింది. సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు చేసింది. 2008లో రైతు రుణమాఫీ చేసింది. 2009 ఎన్నికల్లో 206 సీట్లు సాధించింది. ఎన్డీఏకు ఎల్కే అడ్వాణీ నాయకత్వం వహించారు. భాజపాకు ఈ ఎన్నికల్లో 116 సీట్లు దక్కాయి. ప్రాంతీయ పార్టీలు 146 సీట్లు గెలుచుకున్నాయి. రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మంత్రిగా మన్మోహన్ సింగ్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
 
గత ఎన్నికల్లో...
 
16 లోక్‌సభ (2014-19) 
యూపీఏ రెండోసారి కొనసాగించిన పాలనంతా అవినీతి, కుంభకోణాలమయం అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హవా కూడా ఎన్డీఏకు తోడైంది. భాజపా ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 282 సీట్లను సాధించిగా కాంగ్రెస్‌కు కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. 1984 తర్వాత.. కూటమి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన పూర్తి మెజార్టీని ఓ పార్టీ సాధించడం ఇదే తొలిసారి.