ఇందిరాగాంధీను కాంగ్రెస్ నుంచి గెంటేసిన క‌థ తెలుసా?

January 25, 2020

కాస్త ఆశ్చ‌ర్యం అనిపించిందా? ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బ‌హిష్క‌రించ‌డం ఏంటి? వార‌స‌త్వంగా ఆ పార్టీయే ఇందిరాగాంధీది క‌దా అనుకుంటున్నారా... కాలం ఏమైనా చేస్తుంది. అలాంటి ఓ సంఘ‌ట‌నే ఇది. 70 వ ద‌శ‌కంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వ‌ల్ల కేవ‌లం ఇందిరాగాంధీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా చెడ్డ‌పేరు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ భారీ ప‌రాజ‌యం న‌మోదు చేసింది. దీంతో పార్టీలో ఇందిరాగాంధీ వ్య‌తిరేక వ‌ర్గం ఏర్ప‌డింది. అయితే, అది ఇందిరాగాంధీనే పంపించేటంత‌టి స్థాయికి ఎదుగుతుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు.
ఏం జ‌రిగిందంటే... 1977 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌చ్చాయి. అపుడు ఏపీకి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. ఈ ఎన్నిక‌ల్లో కాసు విజ‌యం సాధించారు. అలా ఆ పార్టీ తెలుగువాడి చేతికి వ‌చ్చింది. అనంత‌రం ప‌రిణామాల్లో ఇందిరాగాంధీ వ‌ర్గం మాదే అస‌లైన క‌మిటీ, పార్టీ మాదే అంటూ వేరే కుంప‌టి పెట్టుకుంది. దీంతో అధ్య‌క్ష స్థానంలో ఉన్న కాసు 1978 జనవరి 1న ఇందిరాగాంధీని పార్టీ నుంచి వెలివేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ (ఐ) పార్టీ పెట్టింది. వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట ఉన్నారు. బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి వారు 'ఇందిరా కాంగ్రెస్' వైపు ఉన్నారు.
ఇరు పార్టీలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆవుదూడ గుర్తు ఎవ‌రికీ ద‌క్క‌లేదు. చివ‌ర‌కు ఇందిర‌కు హ‌స్తం గుర్తు ద‌క్కింది. అంటే ఇపుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ స్థాపించిందే అన్న‌ట్టు లెక్క‌. మ‌రి పార్టీ ఉంది, గుర్తుంది. ఆఫీసు లేదు. మ‌న తెలుగు ఎంపీ జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లును త‌ర్వాత పార్టీ ఆఫీసుగా మార్చారు. అదీ క‌థ‌.