మహేష్‌తో స్పై మూవీ అంటున్న హాలీవుడ్ స్టార్

July 14, 2020

సూపర్ స్టార్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్లో చూడాలన్నది అభిమానుల కల. ఐతే ‘స్పైడర్’ సినిమాలో కొంచెం స్పై లక్షణాలున్న క్యారెక్టర్ చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఎప్పటికైనా మహేష్‌ను జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూపిస్తే అది అభిమానులకు పండగే అనడంలో సందేహం లేదు. కానీ అభిమానుల కోరికను మహేష్ తీర్చలేకపోతున్నాడు. ఐతే ఇప్పుడు ఏకంగా ఒక హాలీవుడ్ స్టార్ నటుడు.. మహేష్ బాబును ఇదే కోరిక కోరడం విశేషం.
‘కమాండో’, ‘ప్రిడేటర్’, ‘ఎక్స్ మెన్: ది లాస్ట్ స్టాండ్’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్.. మహేష్ బాబు ఒక స్పై మూవీ చేయాలని, అందులో తాను నటించాలని కోరుకోవడం విశేషం. మహేష్ గురించి అతడికి ఎవరు చెప్పారో.. అతనేం తెలుసుకున్నాడో ఏమో కానీ.. మన సూపర్ స్టార్‌ను ట్యాగ్ చేస్తూ అతను రెండు ఆసక్తికర ట్వీట్లు చేశాడు.
ముందుగా మహేష్‌‌తో పాటుగా అతడితో ‘మహర్షి’ తీస్తున్న వంశీ పైడిపల్లిని ట్యాగ్ చేస్తూ.. వీళ్లిద్దరూ లాస్ ఏంజెల్స్‌ వచ్చినపుడు లంచ్‌‌కు ఆగితే.. ఒక ఇంటర్నేషనల్ స్పై మూవీ చేయడం గురించి డిస్కస్ చేద్దామని ట్వీట్లో పేర్కొన్నాడు బిల్ డ్యూక్. తర్వాత మరో ట్వీట్లో ఇలాంటి మెసేజే పెట్టాడు. ఐతే అందులో వంశీ బదులు మహేష్‌తో ‘స్పైడర్’ తీసిన మురుగదాస్‌ను ట్యాగ్ చేశాడు బిల్. ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు మన హీరో, దర్శకుల్ని ఇలా ట్యాగ్ చేసి ఇంటర్నేషనల్ స్పై మూవీ గురించి మాట్లాడటం విశేషమే. మరి మహేష్, వంశీ, మురుగదాస్ ఈ ట్వీట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.