డామిట్.... జగన్ ఐడియా అడ్డం తిరిగింది

August 06, 2020

అందుకే అంటారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని. రాజకీయాల్లో దూకుడు మంచిదే. కానీ.. అలాంటి తీరుతో లాభమెంతన్నది పక్కన పెడితే.. జరిగే నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది. విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి రసాయనిక వాయువులు వెలువడిన ఉదంతం సంచలనంగా మారటమే కాదు..పన్నెండు మంది ప్రాణాలు పోయేలా చేసింది. ఐదు వందలకు మించిన బాధితుల్ని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.
ఈ ఉదంతంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి సాయాన్ని ప్రకటిస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనానికి తెర తీశారు. బాధితులకు రూ.25 నుంచి రూ.30లక్షల వరకూ ఆర్థికసాయాన్ని అందించాలని ప్రతిపక్షాలు కోరితే.. వారి అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో రూ.కోటి సాయాన్ని ప్రకటించటం ద్వారా విమర్శలకు నోళ్లు మూయించటమే కాదు.. ఈ తరహా ఎత్తును ఊహించని వారంతా జగన్ నిర్ణయానికి అవాక్కు అయ్యారు. అయితే... వెంటనే దాని వెనుక లోగుట్టును పట్టేశారు. అది వేరే కథ.
మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ.కోటి సాయం ఏపీ సర్కారుకు భారీగా మైలేజీ వస్తుందని గెస్ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. తాజాగా అదో సమస్యగా మారింది. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటున్న జగన్ సర్కారు.. ఆసుపత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న వారి విషయంలో మాత్రం రూ.25 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటన్న ఆగ్రహం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన తమకు రూ.25వేలు ఇచ్చి అవమానిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వారు వేలల్లో ఉండటంతో.. అధికారపక్షం ఇప్పుడు ఇరుకున పడుతోంది. అధికారులు ఇస్తున్న రూ.25 వేల చెక్కును బాధితులు తీసుకోవటానికి నిరాకరిస్తున్నారని.. మమ్మల్ని చావు వరకూ తీసుకెళ్లారు.. ఇప్పుడు ముష్టి చేతుల్లో పెడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనంతటికి కారణం రూ.కోటి పరిహారంగా ప్రకటించటమేనన్న మాట వినిపిస్తోంది.
బాధితులకు ప్రకటించిన పరిహారంలో వ్యత్యాసం ఊహించనంత ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. ప్రమాదంలో మరణించిన వారు.. గాయపడిన వారు తమకెంత సాయం ఇవ్వాలో అడగలేదు. ప్రభుత్వమే ప్రకటించింది. పరిహారాన్ని ప్రకటించేటప్పుడు పొలిటికల్ మైలేజీనే చూశారు తప్పించి.. వాస్తవాల్ని పరిగణలోకి తీసుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే.. తొలుత మైలేజీగా మారిన పరిహారం.. ఇప్పుడు ప్రభుత్వ ఇమేజ్ ను ఫుల్ గా డ్యామేజ్ చేస్తోంది. చనిపోయిన వాళ్ల 12 ఓట్లు వస్తాయి గాని చికిత్స చేయించుకున్న వేల ఓట్లు పోయేలా చేసింది. అన్నిట్లో ఓటు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది.