బాబు దోస్తీ... రాహుల్ ఏం నేర్చుకున్నాడంటే

November 21, 2019

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ... నిన్న‌టిదాకా పెద్ద‌గా వ్య‌వ‌హారం తెలియ‌ని నేత కిందే లెక్క‌. గ‌డ‌చిన ఎన్నికల్లో ఏకంగా యూపీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రాహుల్‌... న‌రేంద్ర మోదీ మేనియా ముందు తేలిపోయారు. తిరిగి చూసుకునే స‌రికి గిర్రున‌ ఐదేళ్లు తిరిగిపోయాయి. మ‌రోమారు ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే ఐదేళ్లు గ‌డిచినా రాహుల్ వ్య‌వ‌హారంలో పెద్ద‌గా మార్పు రాలేద‌న్న వాద‌నే వినిపించింది. అయితే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు దోస్తానాతో రాటుదేలిన రాజ‌కీయ‌నేత‌గా ఎదిగిన రాహుల్‌... మాట‌ల మాంత్రికుడిగా పేరున్న న‌రేంద్ర మోదీని త‌న‌దైన శైలి ఉచ్చు బిగించి ఇరికించేసి ఔరా అనిపించేశారు. అదెలాగో చూద్దాం ప‌దండి.

ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌తిష్ఠను అధోఃపాతాళానికి దిగ‌జార్చిన అంశంగా ఉన్న రాఫెల్ డీల్ పై గ‌త కొంత‌కాలంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రాహుల్ గాంధీ... ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయిన వేళ... చౌకీదార్ చోర్ హై అంటూ కొత్త నినాదాన్ని అందుకోవ‌డంతో పాటు దానిని బాగానే జ‌నాల్లోకి తీసుకెళ్లారు. ఈ నినాదంతో రాహుల్ కొంత‌మేర ఇబ్బంది ప‌డినా పెద్ద‌గా ఆలోచించ‌లేదు. సుప్రీంకోర్టుకు సారీ చెప్పి కూడా తాను కోర్టుకు మాత్ర‌మే సారీ చెప్పాన‌ని, మోదీపై తాను సంధించిన చోర్ కామెంట్ల‌కు క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని త‌న‌దైన శైలి వ్యూహం అమ‌లు చేశారు.

దీంతో స‌హ‌నం న‌శించిన మోదీ... రాహుల్ ను టార్గెట్ చేసే క్ర‌మంలో దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీని లాగేశారు. రాజీవ్ అవినీతి సామ్రాట్ గానే చ‌నిపోయార‌ని సంచ‌ల‌న కామెంట్ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా దేశ భ‌ద్ర‌త‌కు వినియోగించే ఐఎస్ఎస్ విరాట్ ను త‌న జ‌ల్సాల కోసం వినియోగించార‌ని కూడా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఇక్క‌డే రాహుల్ త‌న‌దైన శైలి వ్యూహాన్ని అమ‌లు చేసి మోదీపై న‌లుదిశ‌లా దాడి జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డని రాజీవ్ ను వివాదంలోకి లాగుతారా? అంటూ ఇప్పుడు అన్ని వ‌ర్గాల నుంచి మోదీపైకి విమ‌ర్శ‌లు దూసుకువ‌చ్చేశాయి.

ఇలా మోదీనే త‌న‌దైన ఉచ్చులో రాహుల్ ఇరికించేసిన తెలివి వెనుక చాలా క‌థే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తుగా జ‌రిగిన ఎన్నికల్లో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అప్ప‌టిదాకా శ‌త్రువుగా ప‌రిగ‌ణించిన కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టారు. అప్ప‌టి నుంచి ద‌ఫ‌ద‌ఫాలుగా రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రికి శ‌త్రువు అయిన మోదీని ఎలా టార్గెట్ చేయాల‌న్న విష‌యంపై స‌మాలోచ‌న‌లు చేసిన వీరిద్ద‌రూ రాఫెల్ వ్యూహాన్ని ర‌చించిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఎలాగూ రాఫెల్‌పై ఆరోప‌ణ‌లు సంధిస్తే... మోదీ కూడా బోఫోర్స్ ను ఎత్తుకుంటార‌ని, ఏదో ఒక అన‌వ‌స‌ర కామెంట్ చేస్తార‌ని వీరు ప్లాన్ చేశార‌ట‌. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన చంద్ర‌బాబు... మోదీ మైండ్ సెట్ ను బాగానే అంచ‌నా వేసి రాఫెల్ వ్యూహానికి ప‌దును పెడితే... దానిని సంధించ‌డంలో రాహుల్ స‌ఫ‌లీకృతుడ‌య్యార‌న్న మాట‌. వెర‌సి బాబు గైడెన్స్ లో రాహుల్ సంధించిన అస్త్రానికి మోదీకి దిమ్మ‌తిరిగిపోయింద‌న్న మాట‌.