జగన్ మంచి చేయాలనుకుంటున్నారా? ముంచేయాలనుకుంటున్నారా?

August 06, 2020

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పుడు ఎంత చర్చ జరిగిందో ఇటీవల ఆ జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చిన తరువాత మరోసారి అంతే చర్చ జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం కోసం నిర్బంధం వద్దు.. మీడియంను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండాలనే సదుద్దేశంతో ఈ జీవోలపై హైకోర్టునాశ్రయించి, రద్దు కోసం పోరాడిన బీజేపీ నేత సుధీష్ రాంభొట్లపై ఏపీలోని పాలక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు పెద్ద ఎత్తున విమర్శలు, తప్పుడు ప్రచారాలు, దూషణలకు దిగుతున్నాయి. అయితే.. సుధీష్ రాంభొట్ల మాత్రం తన వ్యాజ్యం ఏపీ ప్రభుత్వానికో, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికో వ్యతిరేకంగా వేసింది కాదని.. దీనిపై పోరాడలేని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి తల్లిదండ్రుల బెంగ తీర్చడం కోసమని ఆయనంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ వేదికలపైన, సోషల్ మీడియాలోనూ ఆయన వినిపిస్తున్న వాదనలకు మద్దతు దొరుకుతోంది. హైకోర్టులో ఆయన వాదనకు ఆమోదం లభించి ప్రభుత్వ జీవోల రద్దుకు ఆదేశాలు వెలువడినట్లే ప్రజల నుంచీ ఆయన వాదన సహేతుకమన్న ఆమోదం అంతటా వ్యక్తమవుతోంది.
చైల్డ్, పేరెంట్ సైకాలజీ..
ఇంతకీ పిటిషనర్ సుధీష్ రాంభొట్ల ఏమంటున్నారు?  బలవంతపు ఇంగ్లిష్ మీడియంతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు లాభం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ నిర్ణయంతో వారికి లాభం కంటే నష్టం ఎక్కువ కలుగుతుందని సుధీష్ అంటున్నారు.. అందుకు లాజిక్ ఆయన చెప్పుకొచ్చారు. చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులని.. అయినా కూడా తమ పిల్లలకు వారు ప్రాథమిక స్థాయిలో ఎంతోకొంత గైడ్ చేయగలరని.. పుస్తకాల్లోని పాఠాల్లో బొమ్మలు చూసి ఆ పేర్లు చెప్పడం.. తమకు తెలిసిన జ్ఞానాన్ని తెలుగులో పంచడం వంటివి చేస్తూ పిల్లలకు అంతోఇంతో విద్యార్జనలో సహాయకారులుగా ఉండగలుగుతారు.. ఒక్కోసారి పిల్లలు స్కూళ్లో మాస్టార్లను అడగలేని బెరకుతనం ఉంటుంది.. అలాంటప్పుడు పిల్లలు తల్లిదండ్రులనే అడుగుతారు.. ప్రాథమిక స్థాయిలో పాఠాల్లోని అనేక అంశాలను నిరక్ష్యరాస్యులు కూడా తమ పిల్లలకు చెప్పగలుగుతారు. కానీ, అదే ఇంగ్లిష్ మీడియం అయితే వారేమీ చెప్పలేరు. అప్పుడు పిల్లలకు పేరెంటల్ గైడెన్స్ పూర్తిగా లేకుండాపోతుంది. ఇది పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి.. వారికి చదువుపై ఆసక్తి పోవడానికి, చదువు కొనసాగించలేకపోవడానికి.. ఫలితంగా డ్రాపవుట్స్ పెరగడానికి దారితీస్తుందంటారాయన.
అంతేకాదు.. విద్యాహక్కు చట్టానికి ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా విరుద్ధమని సుధీష్ రాంభొట్ల చెప్పారు. ఎవరికైనా ఇళ్లలో చిన్నతనం నుంచి ఇంగ్లీషే మాట్లాడే పరిస్థితి ఉంటే వారు ఇంగ్లీష్ మీడియం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అలా కాకుండా అందరిపైనా రుద్దితే మాత్రం విద్యార్థులు నష్టపోతారన్నారు. నిర్బంధ ఆంగ్లమాధ్యమం కనుక అమలైతే కొన్నాళ్లకు తెలుగు కూడా సంస్కృతంలా మారిపోతుందన్నారు. ఇప్పటికే సగానికిపైగా పిల్లలకు తెలుగు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగును పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు మంచివి కాదు. జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తెలుగు మీడియంలో చదివి డాక్టరయ్యారని గుర్తుచేశారు సుధీష్. ఇంగ్లిష్ నేటివ్ లాంగ్వేజ్‌గా లేని అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడి నేటివ్ లాంగ్వేజ్‌లోనే బోధన సాగుతోంది. జపాన్ వంటి దేశాలు అందుకు ఉదాహరణని సుధీష్ రాంభొట్ల చెప్పారు.
ప్రభుత్వం ఉపాధ్యాయులకు వారం రోజులు ఓరియెంటేషన్ సెషన్స్ నిర్వహించి పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెప్పమంటోంది.. కానీ, అప్పటివరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన తెలియని ఉపాధ్యాయులు వారం రోజుల ఓరియెంటేషన్ తరగతులతో ఇంగ్లిష్ మీడియం బోధనకు రెడీ కాలేరని.. దానివల్ల విద్యార్థులకు సరైన బోధన అందదని సుధీష్ రాంభొట్ల చెప్పారు. చైల్డ్ సైకాలజిస్టులు, ఎడ్యుకేషన్ సైకాలజిస్టులు సుధీష్ వాదనతో ఏకీభవిస్తున్నారు. మాతృభాషలో బోధనకు మించింది లేదని చెబుతున్నారు.

కింద ఫొటో: పిటిషనర్ సుధీష్ రాంబొట్ల