క్లినికల్ ట్రయల్ దశలో ఉన్న వ్యాక్సిన్లు ఎన్ని ?

August 12, 2020

భారత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ‘ఓ అంతానికి ఆరంభం’ జరిగిందని పేర్కొంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రెండు కరోనా వ్యాక్సిన్ లు కోవాగ్జిన్, జైకోవ్-డీల హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం అయిన సందర్భంగా కేంద్రం ఈ ప్రకటన చేసింది.  వ్యాక్సిన్  తయారీలో ప్రపంచ వ్యాప్తంగా 100 కంపెనీలు కృషిచేస్తుండగా... 11 మాత్రమే మానవ జాతిపై ప్రయోగ దశకు వెళ్లాయి. అందులో రెండు వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశానివే కావడం గర్వకారణం అని భారత ప్రభుత్వం పేర్కొంది.

"డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్... ఈ సంస్థల నుంచి వచ్చిన అనుమతుల తరువాత వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యాయని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ తాజాగా వ్యాఖ్యానించింది. ట్రయల్స్ దశలోకి వచ్చింది రెండే అయినా.. మొత్తం మనదేశంలో ఆరు కంపెనీలు వ్యాక్సిన్ ఆవిష్కరణకు తమ ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. వాటిలో భారత్ బయోటెక్ కంపెనీది కీలక అడుగు. 

అయితే కొద్దిరోజుల క్రితం ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ అది జరగదు అని...మరింత సమయం పడుతుందని ట్రయల్స్ లో భాగం పంచుకుంటున్నవారు ఆ ప్రకటనను కొట్టిపారేశారు. ఆ ప్రకటన పూర్తిగా అసంబంధం అన్నారు. దీనికి కారణం ఏంటంటే...వ్యాక్సిన్ ట్రయిల్స్ లో తొలి రెండు దశలూ ఏ మోతాదులో వ్యాక్సిన్ ఇవ్వాలన్న విషయం కనుగొనడానికి జరుగుతాయి. మూడో దశలో ఇది ఎంత మేరకు పనిచేస్తుందన్న విషయాన్ని నిర్దారిస్తారు. ఇదంతా రోజులలో జరిగే పని కాదు. నెలలు, సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రస్తుత కీలక పరిస్థితుల్లో వ్యాధిలో మరణాల తీవ్రత తక్కువగా ఉండటం ప్రయోగాలకు వలంటీర్స్ లభ్యత కొరత లేదు. దీనివల్ల కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ సిద్ధమవడానికి అవకాశం ఉంది.  

ఇటీవలే భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రకటన తేదీ చెప్పలేం అని స్పష్టం చేశారు. అయితే... 2021 ముగిసేలోపు 130 కోట్ల మంది భారతీయులకు సరిపడా ఉత్పత్తిని అందించగలమని అన్నారు. ఇదిలా ఉండగా....ఆస్ట్రాజెనికా (బ్రిటన్), మెడెర్నా (అమెరికా) కంపెనీలు ప్రయోగాల దశలో ఉన్నత తమ వ్యాక్సిన్ లు  ఎ.జెడ్.డి 1222, ఎంఆర్ఎన్ఎ 1273ల కోసం ఉత్పత్తి కోసం భారత కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే అవి సిద్ధమైన వెంటనే మన దేశపు కంపెనీలు దానిని ఉత్పత్తి చేస్తాయి. భారత్ ప్రపంచానికే ఫార్మా హబ్.  

Read Also

జూలై 6, జూలై 13 నుండి ఐ-ప్లై విన్నర్స్ వర్క్ షాప్ కోర్సులు
NRI : టాప్ బిజినెస్ వుమెన్‌తో సెమినార్
NRIsForAmaravati : అమరావతి కోసం ఎన్నారైలు (ఫొటోలు)