మోడీ ఆలోచ‌నా విధానం - ఒక సున్నిత ఉదాహ‌ర‌ణ‌

August 10, 2020

ఇది ఒక సంఘ‌ట‌న య‌తాత‌థం.. వివ‌ర‌ణ చివ‌ర‌లో మాట్లాడుకుందాం. ముందు సంఘ‌ట‌న చ‌ద‌వండి.

​పిల్లల్లో Dyslexia అనే ఒక అపసవ్యత ఉంటుంది. అన్నీ విషయాలు అర్ధం అవుతాయి కానీ కొద్దిగా లేట్ గా స్పందిస్తారు. అలాంటి పిల్లల్ని వేరుగా డీల్ చేయాలని చెబుతారు. Dyslexia మీద చాలా రీసర్చ్ జరుగుతుంది. ఆ పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు చాలా స్ట్రగుల్ పడటం చూస్తుంటాము. 

రాజకీయాలు అరాజకీయంగా, అరాచకంగా, ఇన్ హ్యూమన్ గా, ఇన్ సెన్సిటివ్ గా  అయ్యాక అందులో ఉండే మనుషులు కూడా కూడా అంతే. ప్రధాన మంత్రి అందులో తార స్థాయిలో ఉన్నాడు.

మొన్నామధ్య నరేంద్ర మోడి ఐఐటీ రూర్కీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినపుడు వాళ్లలో ఒక అమ్మాయి Dyslexia గురించి, దానికి సంబంధించిన ఆమె ప్రతిపాదించే సోలుషన్స్ గురించి మాట్లాడుతుంది. నరేంద్ర మోడి మధ్యలో కలగచేసుకొని  'నువ్వు చెప్పే పరిష్కారం 40 ఏళ్ల పిల్లాడికి పనికి వస్తుందా?' అని అడిగాడు. ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆ ప్రశ్న వేశాడు. ప్రశ్న అర్ధం అయ్యాక విద్యార్ధులు అందరూ గొల్లుమని నవ్వారు. కొద్ది సెకన్లు ఆ పాప స్టన్ అయ్యి మళ్లీ కొనసాగించింది. తల్లులు ఆ అపసవ్యత వలన పడే బాధల గురించి ఏదో చెప్పబోయింది. 'అయితే ఆ పరిష్కారం అది నలభై ఏళ్ల పిల్లాడి తల్లికి పనికి వస్తుందా?' అని మళ్లీ వంకరగా నవ్వాడు.

రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు బూతులు లాంటి బూతులు తిట్టుకోవడం, అవి వినడం మనకి సహజం అయిపోయింది. అందులో ఎవరి మీదా మనం సానుభూతి చూపించనవసరం లేదు. ఆ మాట కొస్తే నరేంద్ర మోడిని చాయ్ వాలా అనటం కూడా చికాకు అనిపిస్తుంది. 

ఇక్కడ రెండు విషయాలు విషాదం కలిగించాయి. ఒకటి Dyslexia వ్యాధి ఉన్నవాళ్ల పట్ల అతని చిన్నచూపు, అహంకార దృక్పథం. యుద్ధాన్ని, రక్తాన్ని ఎన్నికల సోపానంగా వాడుకొనే వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలం! ఇలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా మనం భరిస్తున్నాము. రోజులు బాగా లేకపోతే ఇంకా భరించాలి. అది సరే.

అసలు  బాధ కలిగించే విషయం. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుకొంటున్న పిల్లల insensitivitiy. గొల్లుమని నవ్విన వాళ్ల నవ్వులు. 'తారే జమీనే పర్' సినిమా చూసి ఆ పిల్లాడికై కన్నీరు కార్చి, ఆ సినిమాను సక్సస్ చేసిన వాళ్లు కూడా వాళ్లలో ఉండి ఉంటారు. వాళ్ళలో నవ్వని పిల్లాడ్ని నేను వెతుక్కొన్నాను.

---

ఇపుడు మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ మ‌న‌స్త‌త్వం గురించి కొన్ని విష‌యాలు మాట్లాడుకోవాలి. న‌రేంద్ర‌మోడీ ఒక వ్య‌క్తి కాదు. నూటా పాతిక కోట్ల ప్ర‌తినిధి. అత‌ని ఆలోచ‌న‌, చ‌ర్య‌, ప‌ని, నిర్ణ‌యం, అభిప్రాయం... మ‌నంద‌రిని ప్ర‌తిబింబించాలి. పొర‌పాటున అందులో ఏ బేష‌జాలు, తేడాలు, ప‌క్ష‌పాతాలు ఉంటే అలాంటి నాయ‌క‌త్వం దేశానికి ఊహించ‌ని ముప్పులు తెస్తుంది. బ‌హుశా ఇలాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌లు గ‌త ప్ర‌ధానులూ చేసి ఉండ‌టం వ‌ల్ల కూడా మ‌నం కొన్ని ఇబ్బందులు ఇప్ప‌టికీ ఎదుర్కొంటున్నాం. 

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న బలం మీద గెల‌వాలి అనుకోవ‌డం లేదు. ఈ దేశ‌పు సామాన్యుడి మాన‌సిక స్థాయిపై ప్ర‌భావం చూప‌డం ద్వారా వారికి న‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా గెల‌వాలి అనుకుంటున్నారు. న‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించే వాళ్లు ఎన్న‌టికీ గొప్ప నాయ‌కులు కాలేరు. మ‌నకు అవ‌స‌ర‌మైన‌ట్లు, ఈ దేశ భ‌విష్య‌త్తును నిర్మించ‌డానికి అవ‌స‌ర‌మైన‌ట్లు, ఈ దేశ భావి పౌరులు నేర్చుకోవాల్సిన వ్య‌వ‌హార శైలితో మెలిగిన‌పుడు మాత్ర‌మే గొప్ప నాయ‌కుడు అవుతారు. ఈ దేశానికి అవ‌స‌ర‌మైన భ‌విష్య‌త్తు కోసం మ‌న‌కు న‌చ్చే వేషాలు వేసే ప్ర‌ధాని కాదు కావ‌ల్సింది..  దేశానికి ఏది మంచిదో అది చేసే ప్ర‌ధాని కావాలి. అంత‌వ‌ర‌కు వేచిచూడ‌ట‌మే మ‌నం చేయ‌గ‌లిగిన ప‌ని. వేచి చూసే ఓపిక లేక‌పోతే.. ఇపుడే మేలుకో!