బాబుకు బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు గ్యారంటీ

May 26, 2020

2017 కి ముందు
కృష్ణా డెల్టా ప్రజలు జూన్ 1 నుంచి ప్రతిరోజు పేపర్లో ఒక వార్తను ఆసక్తిగా చూసేవారు. అది రుతుపవనాల సమాచారం గురించి. అదేంటి... ఏ ప్రాంతం రైతుకి అయినా అదే ఆసక్తి కదా. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా రైతు మాత్రమే ఆ వార్త కోసం చూస్తాడా అని మీరు అనుకోవచ్చు. దీనికి ఒక లాజిక్ ఉంది.
రుతుపవనాలు జూన్ మొదటి లేదా రెండో వారంలో వస్తాయి. అవి ఏపీలో విస్తరించడానికి మూడో వారం కావచ్చు. అయితే గత పదేళ్లుగా ఈ రుతుపవనాలు జూన్ లో భారీ వర్షాలను తేవడం లేదు. దీంతో సాగుకు ఆ వర్షాలు చాలడం లేదు. పోనీ కృష్ణా నది కాలువ నీరు అయినా వస్తుందా అంటే... కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు, సక్రమ ప్రాజెక్టులు అన్ని నిండి ఏపీ తెలంగాణ ప్రాజెక్టులు నిండి చిట్టచివరన ఉన్న ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వచ్చేసరికి అదును పోతోంది. దీంతో కృష్ణా ప్రజలు కర్ణాటకలో విస్తారంగా వర్షాలు పడి ఆ ప్రాజెక్టులన్నీ నిండాలని మొక్కని దేవుడు లేడు. ఎందుకంటే... అవి నిండితే గాని కృష్ణా డెల్టాకు నీరు రాదు. వాన పడక తన భక్తుల కన్నీరు చూసి ఆ బెజవాడ దుర్గమ్మకే మనసు చివుక్కుమనేది.

2017 తర్వాత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా... ఎవరెవరో అడ్డంకులు సృష్టించినా, కేంద్రం మోసం చేసినా... ఖజానాలో కాసులు లేకపోయినా... పట్టి సీమను పట్టుబట్టి పూర్తి చేశారు. దీంతో పంటలతో కృష్ణా డెల్టా కళకళలాడుతోంది. అయినా... పట్టిసీమకు నీరు ఎలా వస్తుందని మీకు అనుమానం రావొచ్చు. అది తెలియాలంటే గోదావరి గురించి తెలుసుకోవాలి.
జూన్ లో నైరుతి రుతుపవనాలు తెచ్చే వానలు అధిక శాతం పశ్చిమ కనుమల తర్వాత చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల్లో కురుస్తాయి. గోదావరి ఉప నదుల్లో పెద్దవి రెండు. ఒక తెలంగాణలో పారే ప్రాణహిత, రెండోది ఒడిసాలో పుట్టి చత్తీస్ ఘర్ మీదుగా గోదావరిలో కలిసే ఇంద్రావతి. ఈ రెండు నదులు గోదావరిలోకి చాలా నీటిని తెచ్చినా... ఇంద్రావతి నది నుంచి జూన్ లోనే గోదావరిలోకి భారీ వరద వస్తుంది. శబరి నది కూడా తన వంతు నీటిని తెస్తుంది. దీంతో జూన్ నాటికే ఖమ్మం జిల్లా ప్రాంతంలో పారే గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిని తెలంగాణ ఎన్నటికీ వాడుకునే అవకాశం లేకపోవడం వల్ల జూన్, జులైలోనే గోదావరి నీరు ఎక్కువైపోయి సముద్రంలో వృథాగా కలిసే పరిస్థితి. ఈ నీటిని వాడుకునే ప్రయత్నమే పోలవరం. 70 ఏళ్లుగా ఇరవై శాతం కూడా పూర్తి గాని పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో 70 శాతం వరకు పూర్తయ్యింది. తాను 2019లోపు కడతానని చంద్రబాబు చెప్పినా... ఎలాంటి అడ్డంకులు వస్తాయో ఏమో అది అసలే కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన ప్రాజెక్టు అని దూరదృష్టి చంద్రబాబు చేసిన ప్లానే పట్టిసీమ. కొనఊపిరితో ఉన్న వ్యక్తిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లే అంబులెన్స్ వంటి ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. పోలవరం పూర్తయ్యే లోపు ఆంధ్రా ఎడారిగా మారకుండా పోలవరం ప్రయోజనాలు పొందడానికి చంద్రబాబు చేసిన ప్రణాళిక పట్టిసీమ. పోలవరం పూర్తయ్యాక దీని ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు... కానీ ఇప్పటికే దీనికి పెట్టిన ఖర్చు తిరిగి వచ్చేసింది. పైగా జగన్ వ్యవహారం చూస్తుంటే... పోలవరంపై ఆయనలో ఆసక్తి కనిపించడం లేదు. అందుకే పోలవరం పూర్తయ్యేదాకా ఆంధ్రాని కాపాడుతున్న అంబులెన్సు, ఐసీయు వంటి ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టా రైతులు ఆల్మట్టి జూరాల పరవళ్ల గురించి ఆలోచించడం మానేశారు. పట్టిసీమను తలచుకుని ప్రశాంతంగా గుండె మీద చేయి వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. చరిత్రలో ఇది ఒక అరుదైన విషయం. ఎందుకంటే... ఒక నది మొదట ఉన్నవాళ్లకు తొలుత నీళ్లు రావడం జరుగుతుంది. కానీ దూరదృష్టితో చేసిన ప్లానింగ్ వల్ల నది చివరలో ఉన్న వారికి తొలకరి సమయంలోనే పుష్కలమైన నీరు అందుతోంది.

అదే సమయంలో  కృష్ణాడెల్టాకు న్యాయం చేస్తూ కరవు తాండవిస్తున్న రాయలసీమలోని ప్రతి ప్రాంతానికి కృష్ణా డెల్టాకు వెళ్లాల్సిన నీటి వాటాను పంచడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతోంది.


ఇపుడు శ్రీశైలం దాకా కూడా నీరు రాకముందే ప్రకాశం బ్యారేజీ కళకళలాడుతోంది. బెడవాడ కనకదుర్గమ్మ తన కళ్లెదుట పారే గంగమ్మ ను చూసి చంద్రబాబును చల్లగా దీవిస్తోంది. కృష్ణా డెల్టా సిరులు పండిస్తోంది. కృష్ణానది ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలలో నీళ్ళు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వరద జలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోంది.
‘‘నదుల అనుసంధాన ప్రయోజనం ఇదే. పట్టిసీమ వృథా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు‘‘ అంటూ చంద్రబాబు ఈ ఫొటోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తంచేశారు. ఆలోచన, సంకల్పం ఉంటే... కరువును కూడా జయించొచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. పాలకులకు కావల్సింది కక్షలు, పగలు, ప్రతీకారాలు కాదు. దూరదృష్టి, అవగాహన.