జగన్ వ్యూహకర్త... అడ్డంగా దొరికిపోయాడు

August 08, 2020

దేశ‌వ్యాప్తంగా పాపుల‌రిటీని సంపాదించి....బ‌డా రాజకీయ‌వేత్త‌లు సైతం త‌న సేవ‌ల కోసం ఎదురుచూసే రేంజ్ సొంతం చేసుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఏ వ్యూహం వ‌ల్ల అయితే పీకే స్టార్ అయ్యారో...అదే వ్యూహం లేక‌పోవ‌డం వ‌ల్ల పీకే ఇబ్బందుల‌పాలు అయ్యారంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న కరోనా సమయంలో ఆయ‌న ఓ వ్యూహం ఆయ‌న్ను ఇరుకున పెట్టిందంటున్నారు. బీజేపీ టార్గెట్ చేసిన ఈ వ్యూహ‌క‌ర్త ఆ పార్టీకి దొరికిపోయార‌ట‌.
తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య కరోనా మరణాల లెక్కల విషయంలో వివాదం కొనసాగుతోంది. బెంగాల్ వాస్తవాలను దాచి పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కుంటోంది. మమత బెనర్జీ అనుమతి నిరాకరించినా... కేంద్రం బృందం కోల్‌కతాలో పర్యటించింది. అయితే, ఈ మాట‌ల యుద్ధంలో భాగంగా, బీజేపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్‌ను హుటాహుటిన కోల్‌కతా రమ్మని దీదీ చెప్పినట్టు సమాచారం. అయితే, లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో దేశ వ్యాప్తంగా అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం అత్యవసర వస్తువుల రవాణాకు మాత్రమే అనుమతిచ్చింది. వ‌స్తువుల ర‌వాణ కోసం కార్గో విమానాలు ప్ర‌యాణిస్తున్నాయి. అయితే, కార్గో విమానంలో ప్రశాంత్ కిషోర్.. బెంగాల్‌ వెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది. బీజేపీయేతర పక్షాలకు సలహాలు, సూచనలు ఇచ్చే ప్రశాంత్ కిషోర్... కార్గో విమానంలో కోల్‌కతా వెళ్లినట్టు విమర్శలొస్తున్నాయి.
అయితే, త‌మ‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు పీకే ప‌ర్య‌టించిన తీరుపై బీజేపీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో విమాన‌యాన శాఖ‌కు ఆదేశాలు వెళ్లాయ‌ని స‌మాచారం. కొన్ని రోజులుగా ఢిల్లీ నుంచి బెంగాల్ వెళ్లిన కార్గో విమానాలను డీజీసీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా చెక్ చేస్తున్నారు. ఢిల్లీ, కోల్‌కతా విమానాశ్రయాల్లోకి ప్రశాంత్ కిషోర్ వచ్చారేమోనన్న వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇదిలాఉండ‌గా, ఈ ఆరోప‌ణ‌ల‌పై పీకే స్పందించారు. తాను దొడ్డిదారిలో ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చి 19న మాత్రమే తాను విమాన ప్రయాణం చేశానని చెబుతున్నారు. అయితే కార్గో విమానంలో కాకుండా రోడ్డు మార్గంలో బెంగాల్ వెళ్లారా అనే ప్రశ్నకు మాత్రం ప్రశాంత్ కిషోర్ సమాధానం దాట వేయ‌డం గ‌మ‌నార్హం.