భలే ఐడియా: ముసలితనం పోస్ట్ పోన్ చేయొచ్చట

December 13, 2019

మనిషి జీవితంలో బాల్యం, య‌వ్వ‌నం, వృద్దాప్యం .. ఈ మూడు ద‌శ‌ల్లో దేనిక‌దే ప్ర‌త్యేకం.. బాల్యం జ్ఞాపకాలను మిగిలిస్తే, య‌వ్వ‌నం బాధ్య‌త‌ల‌ను గుర్తు చేస్తుంది. కానీ వృద్ధాప్యం మాత్రం భ‌యాన్ని క లిగిస్తుంది. చావును నేరుగా గెలిచే శ‌క్తి ఏదీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు అందుబాటులో లేదు. అయితే మ‌నిషి జీవితంలో చివ‌రి ద‌శ‌గా ఉన్న వృద్ధాప్యాన్ని మాత్రం జ‌యించ‌వ‌చ్చు అంటున్నారు వైద్యులు. వృద్ధాప్యం పై ఎలాంటి దిగులు లేకుండా జీవించ‌వచ్చ‌ని, దాన్ని జాప్యం చేయొచ్చ‌ని పేర్కొంటున్నారు.
ఎప్పటికీ యవ్వనంతో ఉండిపోతే ఎంత బాగుండో అని క‌ల‌లు క‌నేవారు లేక‌పోలేదు. 30 ఏళ్లు దాటితే చాలు..  చాలామందికి వృద్ధాప్యం ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడో వచ్చే దానిని గురించి తల చుకుని ఇప్పటి నుంచే కలత చెందుతుంటారు. అయితే ఇటువంటి వారికి ఊర‌ట క‌లిగిస్తూ శాస్త్రవేత్త లు ఓ శుభ‌వార్త  చెప్పారు. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయడం కాదు కానీ, దానిని జాప్యం చేసేందుకు ఏం చేయాలో  కనిపెట్టారు.
ఈ క్రమంలో సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. మనిషి పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు.. జీవక్రియలు, పోషకాహారం, మనస్తత్వం, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి బ్యుటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ దీర్ఘాయువుకు కారణమయ్యే ఎఫ్‌జీఎఫ్21 అనే హార్మోన్ ఉత్పత్తికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
జీవక్రియల తీరును గాడిలో పెట్టడం ద్వారా ఈ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా చూసుకుంటే వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ పెటెర్సన్ తెలిపారు.
వయసు పెరగడం వల్ల బ్యుటిరేట్ ఉత్పత్తి తగ్గుతుందని, ఫలితంగా శరీరం దుర్బలంగా మారుతుందని పేర్కొన్నారు. తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తల ద్వారా బ్యుటిరేట్ స్థాయుల్ని పెంచుకోగలిగితే వృద్ధాప్యం ఆలస్యమవుతుందని వారు వివరించారు.