కరోనాను నిర్లక్ష్యం చేయవద్దు: సీనియర్ పల్మనాలజిస్ట్ డా.శంకర్

August 10, 2020

విజయవాడకు చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శంకర్ రావు కరోనా లక్షణాలతో ఎక్కువమంది మృతి చెందడానికి వారు వైద్యులను ఆలస్యంగా సంప్రదించడమే కారణమని చెబుతున్నారు.

అలాగే తన వద్దకు వచ్చిన వారికి చేసిన చికిత్సను వెల్లడించారు. ఈయన 1986 నుండి వైద్యవృత్తిలో ఉన్నారు.

ఈయన 1975-80లో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

1982-85లో ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ చేశారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు చెన్నైలోని ఓ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ మెడికల్ రూంలో పని చేశారు.

ఆ తర్వాత 1986 ఏప్రిల్ నుండి విజయవాడ నగరంలోని పటమట ప్రాంతంలో కనుమూరి చెస్ట్ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నారు.

తాను ఎక్కువగా ఆస్మాటిక్ వంటి కేసులు చూసినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుందన్నారు.

కరోనా విస్తరణకు, దాని తీవ్రతకు ప్రధాన కారణం... ఆలస్యంగా గుర్తించడమేనని చెబుతున్నారు. కోల్డ్, కాఫ్, ఫీవర్ వంటి లక్షణాలు సహజమని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు.

కరోనా వల్ల పలువురు మృతి చెందడానికి అసలు కారణం వారు డాక్టర్ల వద్దకు ఆలస్యంగా రావడం ప్రధాన కారణమని చెబుతున్నారు.

ఎందుకంటే ఇది సాధారణ కోల్డ్, ఫీవర్‌గా భావించి రావడం లేదన్నారు. కాబట్టి కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా ఉన్నట్లు పరీక్షల ద్వారానే గుర్తించగలమన్నారు.

తన వద్దకు ఈ లక్షణాలలో వచ్చిన వారికి హెచ్ఆర్‌సిటీ స్కాన్ చేయిస్తున్నానని చెప్పారు.

దానిని విశ్లేషించి మొదటి రోజు స్టెరాయిడ్ ఇస్తున్నానని, దీనిని లక్షణాల ఆధారంగా పరిమిత మోతాదులో వారం నుండి పది రోజుల పాటు ఇస్తున్నట్లు తెలిపారు.

క్రమంగా ఈ డోస్ తగ్గిస్తూ ఇస్తున్నట్లు తెలిపారు.

పేషెంట్ ప్రారంభదశలో వస్తే తాను హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఇస్తున్నానని, 50 ఏళ్ల వయస్సు లోపు వారికి అజిత్రోమైసిన్ యాంటీ బయోటిక్, 50 ఏళ్ల పైబడిన వారికి మరో యాంటీ బయోటిక్ ఇస్తున్నట్లు తెలిపారు.

అజిత్రోమైసీన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, కాబట్టి పీపీఐతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ, జింక్, ప్రొటీన్ డీ  ఇస్తున్నట్లు తెలిపారు.

వృద్ధులకు, ఒబెసిటీ ఉన్నవారికి ఎకోస్ప్రిన్ ఇస్తున్నట్లు తెలిపారు.

తన వద్దకు వచ్చే పేషెంట్స్ అందర్నీ ఆక్సిజన్ సాచురేషన్ తెలుసుకోవడం కోసం పల్స్  ఆక్సీమీటర్ కొనుగోలు చేయమని చెబుతున్నానని, రోజుకు నాలుగుసార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

50 ఏళ్లకు పైబడిన వ్యక్తుల ఆక్సిజన్ సాచురేషన్ 96, 50 ఏళ్ల లోపు ఉంటే 97 ఉండవచ్చునని చెప్పారు. 90 వరకు ఉండవచ్చునని చెప్పారు.

మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యమని, పరిశుభ్రంగా ఉండాలన్నారు.

గత రెండు నెలల కాలంలో తన వద్దకు దాదాపు 200 కేసులు వచ్చాయని, ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే మరణించారని తెలిపారు. అదీ కూడా ఆయన వయస్సు 77 ఏళ్ళు ఉండటంతో పాటు అతను దాదాపు ముదిరిన తర్వాత వచ్చారన్నారు.

ఫేవిపైరవీర్ బాగుందని, ఇదివరకు ఓ కోర్సుకు రూ.30వేల వరకు అయ్యేదని, ఇప్పుడు రూ.10వేల్లో అవుతుందని చెప్పారు.

ఇటీవల గ్లెన్‌మార్క్ ధరను కూడా తగ్గించిందని గుర్తు చేశారు. దీంతో రూ.9,600 వరకు అవుతుందన్నారు.