తెలంగాణ హైకోర్టు హృతిక్ కు ఇచ్చిన భ‌రోసా ఏమంటే?

August 07, 2020

కాసులు వ‌స్తున్నాయ‌ని ఎడాపెడా యాడ్స్ లో న‌టించే సెల‌బ్రిటీల‌కు ఈ మ‌ధ్య‌నే వ‌చ్చిన కొత్త చ‌ట్టం వ‌ణుకు పుట్టిస్తోంది. ఏదైనా ప్ర‌క‌ట‌న‌లో ఒక సెల‌బ్రిటీ న‌టిస్తే.. ఆ ఉత్ప‌త్తికి సంబంధించి ఏదైనా స‌మ‌స్య‌లు ఏర్ప‌డితే.. స‌ద‌రు కంపెనీతో పాటు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ముఖుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు. డ‌బ్బులిచ్చారు.. ప్ర‌మోష‌న్ చేశామంటే కొత్త చ‌ట్టంతో కుద‌ర‌దు. ఈ చ‌ట్టం కార‌ణంగా గ‌తంలో మాదిరి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు సెల‌బ్రిటీలు తొంద‌ర‌ప‌డ‌టం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ కు ఇబ్బందిక‌ర పరిస్థితి ఎదురైంది. హైద‌రాబాద్ కు చెందిన ఒక‌రు బ‌రువు త‌గ్గుతారంటూ త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో మోసం చేశారంటూ క‌ల్ట్ ఫిట్ హెల్త్ కేర్ మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ డైరెక్ట‌ర్లు ముకేశ్ బ‌న్సాల్ .. అంకిత్ న‌గోరితోపాటు మ‌ణి సుబ్బ‌య్య‌ల మీద కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు.. క‌ల్ట్ ఫిట్ కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న హృతిక్ రోష‌న్ మీదా మోసం కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదును ప‌రిశీలించిన కుక‌ట్ ప‌ల్లి పోలీసులు కంపెనీ డైరెక్ట‌ర్ల మీదా హృతిక్ మీదా కేసు న‌మోదు చేశారు.
ఈ నేప‌థ్యంలో క‌ల్ట్ ఫిట్ తో పాటు హృతిక్ త‌మ మీద కేసుల్ని కొట్టి వేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు.. కంప్లైంట్ చేసిన శ్రీ‌కాంత్ కు నోటీసులు జారీ చేశారు. నాలుగువారాల పాటు కేసు విచార‌ణ‌ను వాయిదా వేశారు. అదే స‌మ‌యంలో ఆ గ‌డువు వ‌ర‌కు హృతిక్ తో పాటు క‌ల్ట్ ఫిట్ ప్ర‌తినిధుల‌పైనా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని పోలీసుల‌కు న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ నిర్ణ‌యం హృతిక్ రోష‌న్ కు ఊర‌ట‌నిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.