ఇలాంటివేళలోనూ ఈ బాదుడేంది మోడీ?

August 14, 2020

తియ్యటి మాటలు చెబుతూనే.. తిత్తి తీసేటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. తనకు తాను చాలా సింఫుల్ గా ఉంటానని చెబుతూనే.. ఖరీదైన దుస్తుల్ని వాడేయటం ఆయనకు అలవాటు. దేశాధినేతకే వంకలు పెడతావా? అంటూ రంకెలు వేసేటోళ్లు కొందరు ఉంటే.. దేశభక్తికి నిలువెత్తు రూపమైన మా నమోను ఇన్నేసి మాటలు అంటున్నందుకు నీ కళ్లు పేలిపోతాయి? అంటూ శాపనార్థాలు పెట్టేవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివారంతా గుర్తించాల్సిన సంగతేమిటంటే.. మోడీలోని లక్షణాలు చెబుతున్నామే తప్పించి.. ఆయనతో వ్యక్తిగత పంచాయితీ ఏమీ లేదన్నది మర్చిపోకూడదు.

ప్రజల పక్షాన మాట్లాడేటప్పుడు.. పాలకుల్ని నిలదీయటం.. వారి తప్పుల్ని ఎత్తి చూపటం.. వారి నిర్ణయాల కారణంగా ప్రజలు కష్టపడుతుంటే కడిగేయటం లాంటివి సహజ ప్రక్రియలు. అలాంటి వాటికి తిట్లు.. శాపనార్థాలు లాంటివేమీ పని చేయమన్నది మర్చిపోకూడదు. ఇంతకీ మోడీ మాష్టారిని ఇప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోయి.. కాస్త కొంటే చాలురా భగవంతుడా అని క్రూడాయిల్ అమ్మే దేశాలు కళ్లల్లో వొత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న వేళ.. లీటరు పెట్రోల్.. డీజిల్ కు ధరల్ని పెంచేస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవటం ఏమిటి? అంతర్జాతీయంగా ధరలు నేలకు చూస్తుంటే.. దేశంలో ధరలు పెరగటం దేనికి నిదర్శనం. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం అంటే.. కనిపించకుండా చాలా రంగాల మీద ప్రభావం పడేలా చేయటమే. అలాంటివి జాతిప్రజలకు ఇబ్బందులకు గురి చేయటం ఖాయం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గాల్సి ఉంది. అందుకు భిన్నంగా రూ.60పైసలు చొప్పున పెంచటమంటే.. వేలాది కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లే. చమురు రంగ సంస్థలు ధరలు పెంచితే మోడీని తప్పు పడతారెందుకు అంటారా? కేంద్రం ఓకే చెప్పకుండా.. ఇంధన సంస్థలు రేట్లు పెంచే సాహసం చేయవు. అంటే.. మోడీ మాష్టారు ఓకే అన్నాకే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటారన్నది మర్చిపోకూడదు.

మోడీ పవర్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్.. డీజిల్ ధరలు దిగి వస్తాయని చాలామంది ఆశించారు. ఎంతో ఆశగా ఎదురుచూశారుకూడా. కానీ.. తనకు ఏ మాత్రం అవకాశం లభించినా.. ధరల్ని పెంచేస్తూ.. వాటి ద్వారా ఖజానాను నింపుకోవాలన్నట్లుగా మోడీ సర్కారు ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా చూసినప్పుడు ప్రజల మీద భారం వేసేలా బాదుడులో మోడీకి మించినోళ్లు లేరని చెప్పక తప్పదు.