కేసీఆర్ అవినీతి కథ విపులంగా చెప్పాడు

February 19, 2020

రాజకీయాల్లో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వారు తెలీని రీతిలో మెకానికల్ గా మారతారు. తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దీంతో మొత్తానికి మోసం జరుగుతుంది. దీనికి సరైన ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్. 2014 ఎన్నికల వేళలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఎవరినైనా కదిలించినా ఫుల్ జోష్ లో ఉండేవారు. ఒకవేళ ఓడినా పోయేదేముంది ఐదేళయ్యాక అధికారంలోకి వస్తామనుకునే వారు. కానీ ఆలస్యంగా...  కేసీఆర్ లాంటోడి చేతికి అధికారాన్ని కట్టబెడితే పార్టీకి జరిగే నష్టం ఎంతో అర్థమయ్యాక వారు కిందామీదా గింజుకునే పరిస్థితి.
తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్లోనూ ఒకలాంటి నెమ్మదితనం వచ్చేసింది. పవర్ తో పాటు వచ్చే ధీమా పెరిగిపోయింది. రెండో దఫా తమ సారు మేజిక్ చేసేసి భారీ ఎత్తున సీట్లు సొంతం చేసుకున్న వేళ.. తమ భవిష్యత్తు దిగులు లేదన్న ధీమా పెరిగిపోయింది. ఇదే.. ప్రత్యర్థులకు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వటమే కాదు.. అధికారపక్షంపై భారీగా పంచ్ లు వేయటానికి అవకాశాన్ని ఇస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 2023లో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలని డిసైడ్ అయిన బీజేపీ నేతలు.. ఇప్పుడు తమ ఫోకస్ ను మరింత పెంచారు. ఢిల్లీ స్థాయిలోనూ ఇదే పట్టుదలతో ఉండటంతో.. తెలంగాణ సంగతి చూడాల్సిందిగా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి.
మోడీషాలతో తరచూ టచ్ లో ఉండే నడ్డా.. ఇప్పుడు తన చూపంతా తెలంగాణ మీదనే కేంద్రీకరించారు. తాజాగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు.. కార్యకర్తలు బీజేపీలో చేరిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మిస్ అవుతున్నది.. బీజేపీ నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న ఫైటింగ్ స్పిరిట్ వారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు నడ్డా వేసిన పంచ్ మామూలుగా లేదు. వాస్తు బాగోలేదనే కారణంతో సచివాలయాన్ని కూలగొడుతున్నారని.. పాలన సచివాలయం నుంచి సాగటం లేదని.. కేసీఆర్ ఇంటి నుంచే సాగుతుందని వార చెప్పారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూల్చేస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ కు దాని వాస్తు బాగుంటే ఎంత? బాగలేకపోతేే ఎంత? వాస్తు సంగతి కేసీఆర్ కు 2023లో బాగా తెలుస్తుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇదొకటే కాదు... కాళేశ్వరం పేరుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూస్తే... దేవతల పేర్లు పెట్టి అపవిత్రం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 వేల ప్రాజెక్టుకు 80 వేల కోట్లు ఖర్చు చేసి భారీ మొత్తంలో రైతుల్ని, ప్రజల్ని మోసం చేసినట్లు తేల్చేశారు.
ఆ మధ్య ఎన్నికలకు ముందు కేసీఆర్ నిజాయితీ గురించి ప్రధాని మోడీ సర్టిఫికేట్ ఇవ్వటాన్ని మర్చిపోకముందే.. అదే బీజేపీ అగ్రనేతల్లో ఒకరు తెలంగాణ బాస్ అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు. మిషన్ కాకతీయను మిషన్ ఫర్ కమిషనర్ గా మార్చారని మండిపడటం చూస్తుంటే.. కేసీఆర్ మీద కమలనాథులు వార్ డిక్లైర్ చేసినట్లుగా చెప్పకతప్పదు.