ఓఎన్ జీసీలో భారీ అగ్నిప్రమాదం.. ఎంత పెద్దదంటే?

July 06, 2020

ఇంట్లో చోటు చేసుకునే అగ్నిప్రమాదానికి.. పెట్రోల్ బంక్ లో చేసుకునేప్రమాదానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలానే.. ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు. అలాంటిది ఏకంగా నిప్పును ఇట్టే పుట్టించే పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. తాజాగా చోటు చేసుకున్న ప్రమాదాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఫ్లాంట్ సంక్షిప్తంగా చెప్పాలంటే.. ఓఎన్ జీసీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబయిలోని ఓఎన్ జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లుగా చెబుతున్నారు. ముంబయిలోని ఉరాన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఈ ఉదయం 6.45 గంటల వేళలో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
అగ్నిప్రమాదం చోటు చేసుకున్న నిమిషాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగే సమయానికి ప్లాంట్ లో పలువురు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఐదుగురు మరణించగా.. పలువురు గాయాలపాలైనట్లుగా తెలుస్తోంది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్నంతనే.. ఉరాన్.. పన్వేల్.. జేఎస్ పీటీ.. నెరూల్ ప్రాంతాల నుంచి 50 అగ్నిమాపక యంత్రాలు పని చేస్తున్నాయి.
మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు భారీగా కసరత్తు చేస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న ఘటనా స్థలం నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతం వరకూ ప్రజల్ని అనుమతించటం లేదు. ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? అన్న విషయాలు బయటకు రాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఉరాన్ నుంచి గ్యాస్ ను గుజరాత్ లోని హజీరా ఓఎన్ జీసీ ప్లాంట్ కు తరలిస్తున్నారు. మంటల్ని కంట్రోల్ చేయటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో ఆకాశంలో దట్టమైన పొగతో నిండిపోయింది.