అతిపెద్ద పేలుడు, భారీ మంటలు... వణికిపోయిన విశాఖ

August 10, 2020

విశాఖపట్నం నగరాన్ని ఇండస్ట్రియల్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి.  ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీతో అల్లాడిపోయిన విశాఖ నగరానికి మరో ముప్పు ముంచుకొచ్చింది. విశాఖపట్నం ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఈ మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే... అగ్నిమాపక దళం పావు కిలోమీటరు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. పెద్ద పెద్ద పేలుళ్లు, ఆకాశాన్నంటే భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా ఎవరూ సమీపానికి వెళ్లలేని దారుణ పరిస్థితి నెలకొంది.   

సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తుండటంతో జనం ఉలిక్కిపడ్డారు. వైరల్ అయిపోయింది ఈ ప్రమాదం. నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మొత్తం  17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు కాస్త తగ్గితే గానీ ప్రమాద ప్రాంతానికి దగ్గరగా అగ్నిమాపక దళాలు వెళ్లలేవు. పరిస్థితులు గంట తర్వాత కూడా అదుపులోకి రాలేదు.