హుజూర్‌న‌గ‌ర్‌లో గులాబీ అష్ట‌దిగ్బంధం

February 23, 2020

తెలంగాణ‌లోని హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ సైన్యం మోహ‌రించింది.  ఒక్క‌టే సీటు అయినా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీ సుకోవాల్సిందే.. చేజిక్కించుకోవాల్సిందే అన్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది అధికార టీఆర్ ఎస్ పార్టీ. ఇందు కోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌.. ప‌క‌డ్బందీ వ్యూహం, ప‌టిష్ట‌మైన బ‌ల‌గంతో ముందుకెళ్తోంది. ఇప్ప‌టికే పార్టీ పెద్ద‌లు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓసారి చుట్టివ‌చ్చి, ఎవ‌రికి ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించాలో నిర్ణ‌యించి, ఆదేశాలు కూడా జారీ చేశారు. నేటి నుంచి కీల‌క నేత‌లు సైతం రంగంలోకి దిగ‌నున్నారు. ఓవ‌రాల్‌గా ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు.

మొత్తానికి కాంగ్రెస్‌ను అష్ట‌దిగ్బంధం చేయాల‌ని నిర్ణ‌యించింది అధికార టీఆర్ ఎస్ పార్టీ.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆ పార్టీ ఇక పూర్తిస్థాయి యుద్ధానికి తెర‌లేపింది. ఇంత కాలం క్షేత్ర‌స్థాయిలో ఓటు బ్యాంక్‌ను చాప‌కింద నీరులా చ‌క్క‌బెట్టుకున్న గులాబీ పార్టీ ఇక 700  మంది సుశిక్షుతులైన పార్టీ సైనికుల్ని రంగంలోకి దింపింది. వీరంతా స‌మాజిక‌వ‌ర్గాల వారీగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తీ ఒక్క ఓట‌రు ల‌క్ష్యంగా వీళ్లు ముందుకుసాగుతున్నారు. మంత్రులు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న త‌మ సామాజిక‌వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆంధ్రా స‌రిహ‌ద్దులో ఉండ‌డంతో పాటు క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉండ‌డంతో కేసీఆర్ వాళ్ల‌ను ఆక‌ర్షించేందుకు ఆ వ‌ర్గానికి చెందిన మంత్రి పువ్వాడ అజ‌య్‌తో పాటు ఆ వ‌ర్గం ఎమ్మెల్యేల‌ను అక్క‌డే మోహ‌రించారు. ఇక వీరితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్య‌ద‌ర్శులు మొత్తం మ‌రో 80 మంది నేటి నుంచి ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో కాంగ్రెస్‌ను అష్ట‌దిగ్బంధం చేస‌కుంటూ వ‌స్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఈక్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలోని జెడ్పీటీసీల‌తోపాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌ల‌ను కూడా ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌లోకి పెద్ద ఎత్తున్న చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు మిగిలిన కాంగ్రెస్ నాయ‌కుల‌ను కూడా క‌ద‌ల‌నీయ‌కుండా క‌ట్టుదిట్టం చేస్తున్నారు.

మ‌న‌కు ఓటు వేయ‌కున్నా ప‌ర్వాలేదు...కానీ అటువైపు ప‌డ‌కుండా చూసుకుంటే చాలు అన్న ల‌క్ష్యంతో టీఆర్ ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. ఇక ఎలాగైనా ఇక్క‌డ గెలిచేందుకు టీఆర్ఎస్ భారీ ఎత్తున నిధులు కుమ్మ‌రించేస్తోంది. టీఆర్ఎస్ ప్ర‌లోభాల ప‌ర్వం ఓ రేంజులో ఉండ‌బోతోందంటున్నారు. ఇక కాంగ్రెస్ ఈ విష‌యంలో ఇప్ప‌టికే చేతులు ఎత్తేసింది. ఆ పార్టీకి ఉన్న చిన్న హోప్ ఏంటంటే జిల్లాకు చెందిన ఉద్దండులు అయిన ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్లు ఏక‌తాటి మీద‌కు రావ‌డం. ఏదేమైనా హుజూర్‌న‌గ‌ర్లో ప్ర‌స్తుతానికి టీఆర్ఎస్ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.