టీఆర్ఎస్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాకే..

February 28, 2020

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ లో పాగా వేసేందుకు అధికార పార్టీ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధ చేసింది. ప్ర‌త్య‌ర్థుల‌కు అంతుచిక్క‌ని విధంగా వ్యూహాలు ర‌చిస్తూ.. గెలుపే ల‌క్ష్యంగా క‌ద‌న‌రంగంలో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టి, ఈసారి నియోజ‌క‌వ‌ర్గంపై గులాబీ జెండాను ఎగుర‌వేయాల‌ని పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఈక్ర‌మంలోనే హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించారు.  ఉప ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే గ‌ట్టి ప ట్టుద‌ల‌తో ఉన్న ఆయ‌న .. .ప్ర‌చార వ్యూహాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చే స్తున్నారు.

పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ .. పార్టీ ఇన్‌చార్జిల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఇన్‌చార్జి ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జ‌గ‌దీశ్‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్ పాల్గొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ ఎస్ జెండా ఎగుర‌వేయాల‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని ఎన్నిక‌ల వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే బుధ‌వారం నిర్ణ‌యించిన ఇన్‌చార్జిల జాబితాలో గురువారం కొన్ని మార్పుల చేశారు.

మొత్తం 60 మంది ఇన్‌చార్జిల‌కు మండ‌లాలు, సామాజిక వ‌ర్గాల వారిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు లేని మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూర్‌న‌గ‌ర్ ప‌య‌న‌మ‌య్యారు. సీఎం ఆదేశాల మేర‌కు తాజాగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌తోపాటు మానుకోట ఎంపీ మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యేలు శంక‌ర్‌నాయ‌క్‌, ర‌వీంద్ర నాయ‌క్ త‌దిత‌రుల‌కు నూత‌న జాబితాలో స్థానం క‌ల్పించారు. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌కు చేరువ‌య్యేందుకు సామాజిక‌వ‌ర్గాలవారిగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల‌ను దృష్టి పెట్టుకుని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజ‌య్‌తోపాటు ఎమ్మెల్యేలు భాస్క‌ర్‌రావు, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ను హుజూర్‌న‌గ‌ర్ లో మోహ‌రిస్తున్నారు. వీరంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ను నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు. మొత్తానికి గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ వ్యూహాలు ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం అవుతాయో ? తెలియాలంటే మాత్రం ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.