హుజూర్‌న‌గ‌ర్లో సానుభూతి ఎవ‌రికి...!

February 23, 2020

తెలంగాణలోని హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఇక్కడి నుంచి ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ హుజూర్‌న‌గర్ ఉప ఎన్నికను రసవత్తరమైన రేసుగా మార్చేశారు. ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ సైతం తమ అభ్యర్థిగా మాజీ జెడ్పిటిసి చావా కిర‌ణ్మియిని రంగంలోకి దించడం... అటు ఇక్క‌డ ప‌ట్టున్న సీపీఎం పార్టీ అభ్య‌ర్థి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంతో అంచ‌నాలు మారుతున్నాయి. ఇక టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు వచ్చే ఓట్లు ప్రధాన పార్టీలు ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఎవరికి ? ప్లస్ అవుతాయి ఎవరికి మైనస్ అవుతాయి అన్నది... రాజకీయ విశ్లేషకుల‌కు అర్థంకాని పరిస్థితి.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి మొత్తం ఉత్త‌మ్ కంచుకోటను బద్దలు కొట్టి సగర్వంగా హుజూర్‌న‌గర్ లో టిఆర్ఎస్ జండా ఎగరవేసేందుకు గులాబీ బాస్ కెసిఆర్ సకల అస్త్రశస్త్రాలు వాడుతున్నారు.
ఇప్పటికే హుజూర్‌న‌గర్ లో కులాల వారీగా ఓటర్లను ఆకర్షించే ప‌నిలో టీఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిజీగా ఉన్నారు. టిఆర్ఎస్ నుంచి మొత్తం 70 మంది కీలక నేతలు హుజూర్‌న‌గర్ లోనే మకాం వేసి టిఆర్ఎస్ తరఫున వ్యూహాలు పన్నుతున్నారు.

ఇక నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉండగా.. ఒక్కో మండలానికి ముగ్గురు కీలక నేతలను ఇన్‌చార్జిగా నియమించారు. వీటితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సానుభూతి అస్త్రాలు కూడా తన ప్రచారంలో వాడుతున్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చివరివరకు గట్టిపోటీ ఇచ్చిన సైదిరెడ్డి కేవలం 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అధికారంలోకి రావడంతో తన సొంత మండలం మ‌ఠంపల్లిలోనే నివాసం ఉంటూ నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేస్తూ పార్టీని పటిష్టం చేశారు. ప్రస్తుతం హుజూర్ నగర్ పరిపాలన అంతా సైదిరెడ్డి కనుసన్నల్లోనే నడు స్తు ఉండడంతో చాలామంది పనుల నిమిత్తం ఆయన వద్దకు పరుగులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సైదిరెడ్డి ప్రజల్లోకి గత ఏడాది కాలంగా మరింతగా దూసుకుపోయారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టినా స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత రెండు సార్లు గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇక్కడ అభివృద్ధి చేయడానికి స్కోప్ లేకుండా పోయింది.
ఇక తాము ఉత్త‌మ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నల్లగొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో... తమకు దూరం అయిపోయాడ‌న్న భావన కూడా హుజూర్‌న‌గర్ ప్రజల్లో వచ్చేసింది.

ఇక కోదాడ‌లో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన పద్మావతి ఇప్పుడు హుజూర్‌న‌గర్ లో పోటీ చేస్తుండడంతో... రేపు ఆమె గెలిచినా హైద‌రాబాద్‌కు వెళ్లి పోతార‌ని విపక్షాలు చేస్తోన్న ప్రచారం సైతం సైదిరెడ్డికి ప్లస్ గా మారింది. ఇక గత ఎన్నికల్లో భార్య పద్మావతిని కోదాడలో గెలిపించుకోలేకపోయిన‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి...  మరి ఇప్పుడు సొంత ఇలాకా అయిన గెలిపించుకుంటారా ? లేదా అన్నది ఈ నెల 24న తేలిపోనుంది. ఇదే టైమ్ లో ఓడిపోయిన స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్న సైదిరెడ్డికి ఈ సారి ఛాన్స్ ఇవ్వాల‌న్న అభిప్రాయం అక్క‌డ స్థానికంగా వ్య‌క్త‌మ‌వుతోంది.