హుజూర్‌న‌గ‌ర్‌లో క‌మ‌లద‌ళం అదిరిపోయే స్కెచ్‌..!

July 05, 2020

హుజూర్‌న‌గ‌ర్‌లో క‌మ‌ల‌ద‌ళం మ్యాజిక్ చేస్తుందా..?  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌నే కంటిన్యూ చేస్తుందా..? అధికార టీఆర్ఎస్‌ను మ‌రోదెబ్బ కొడుతుందా..?, సిట్టింగ్ స్థానం కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇస్తుందా..? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నంలోనూ ఉత్ప‌న్న‌మవుతున్నాయి. ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌సీటుకే ప‌రిమితం అయిన‌ బీజేపీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాత్రం అనూహ్య ఫ‌లితాల‌ను అందుకుంది.
ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా.. ఏకంగా నాలుగు స్థానాల్లో విజ‌య‌దుందుభి మోగించింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెలిచి.. అదే దూకుడును కొన‌సాగించాల‌ని క‌మ‌ల‌ద‌ళం చేస్తోంది. అయితే.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ గెలిచేంత ప‌ట్టు సంపాదించిందా..? అంటే డౌటేన‌ని చెప్పొచ్చు కానీ.. తాజా వ్యూహంతో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు షాక్ త‌ప్ప‌ద‌నే టాక్ వినిపిస్తోంది.
ఏమిటా వ్యూహం అంటే.. ఇక్క‌డి నుంచి తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో తొలి అమ‌రుడు శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను బ‌రిలో దింపేందుకు క‌మ‌లం పెద్ద‌లు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. శంక‌ర‌మ్మ‌ను బరిలోకి దించేతే.. తొలి అమ‌రుడి త‌ల్లికి మ‌ద్ద‌తుగా అండ‌గా నిలిచిన‌ట్టు అవుతుంద‌ని, ఇదే స‌మ‌యంలో కేసీఆర్‌పై మ‌రింత దూకుడుగా విమ‌ర్శ‌లు గుప్పించ‌వ‌చ్చున‌నే ఆలోచ‌న‌లో క‌మ‌లం పెద్ద‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఆమెతో సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంద‌.
నిజానికి.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స్వ‌ల్ప తేడాతోనే బ‌య‌ట‌ప‌డ్డారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి దాదాపు ఉత్త‌మ్‌ను ఓడించినంత ప‌నిచేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ కేవ‌లం 7 వేల ఓట్ల‌తోనే గెలిచారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ న‌ల్ల‌గొండ నుంచి పోటీ చేసి గెల‌వ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నిక‌లో ఉత్త‌మ్ స‌తీమ‌ణి, మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తిని బ‌రిలో దింపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ సానుభూతి ప‌ని చేస్తుంద‌ని మ‌ళ్లీ సైదిరెడ్డినే రంగంలోకి దింపింది.
ఇక వీరికి ధీటుగా ఉండాలంటే.. శంక‌ర‌మ్మ అయితే..క‌రెక్టు అనే భావ‌న‌లో బీజేపీ నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.  ఇక 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి బ‌రిలోకి దిగిన శంక‌ర‌మ్మ ఉత్త‌మ్ చేతిలో ఓడిపోయారు. మొన్న‌టి ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆమె ప‌లుమార్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా పోటీ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో శంక‌ర‌మ్మ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఆమెపై వ‌లవేసి టిక్కెట్ ఆఫ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.