హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్‌కు భ‌యం అందుకే..!

February 26, 2020

హ‌జూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గెలుపు ద‌రిదాపుల్లోకి వ‌చ్చి ఆగిపోయింది. ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెలిచి తీరాల‌న్న క‌సితో గులాబీద‌ళం ముందుకు వెళ్తోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీని ఒక ఆందోళ‌న కూడా వెంటాడుతోంది. ఒక‌టి రెండు అంశాలు గులాబీ నేత‌ల‌ను భ‌యానికి గురిచేస్తున్నాయి. 2018లో జ‌రిగిన‌ట్టే ఈసారి కూడా జ‌రుగుతుందా..? అనే అనుమానాలు వారిలో క‌లుగుతున్నాయి.
దీంతో గెలుపుపై ధీమా ఎంత‌గా వ్య‌క్తం చేస్తున్నారో.. లోలోప‌ల మాత్రం ఓట‌మి భ‌యం కూడా అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో గులాబీ నేత‌లు మ‌రింత ప‌క‌డ్బందీగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఎక్క‌డ కూడా చిన్న‌పాటి ప్ర‌య‌త్న లోపం లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతున్నారు.
ఇంత‌కీ.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఆందోళ‌న‌కు గురి చేస్తున్న అంశాలు ఏమిటంటే.. ఒక‌టి కారు గుర్తును పోలిన మ‌రో రెండు గుర్తులు ఉండ‌డం.. రెండోది.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో ఏర్ప‌డిన ప‌రిస్థితులు. ఈ రెండు అంశాలు గులాబీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మ‌ళ్లీ గెలుపు అంచుల‌దాకా వ‌చ్చి ఆగిపోతామా..? అనే అనుమానాలు వారిలో క‌లుగుతున్నాయి.
నిజానికి.. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కారు గుర్తును పోలిన ట్ర‌క్కు గుర్తు ఉండ‌డం వ‌ల్ల చాలా చోట్ల కొద్దిపాటి తేడాతో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఓడిపోయార‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో కూడా కారు గుర్తును పోలిన మ‌రో రెండు గుర్తులు ఉండ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లి.. ప్ర‌తీ ఓట‌రును క‌లుస్తున్నారు.
ఇక ఈ నెల 5వ తేదీ నుంచి జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది. పార్టీవ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉద్యోగులు, సామాన్య జ‌నంలోనూ ప్ర‌భుత్వంపై కొంత వ్య‌తిరేక భావంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక అంద‌రిలో ఉత్కంఠ‌ను రేపుతోంది.
కాగా, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావతిరెడ్డి, అధికార టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బ‌రిలో ఉన్నారు. ఇక టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నా.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్య‌నే నువ్వా.. నేనా..? అన్న రీతిలో పోటీ ఉంటుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. ఈ నెల 21న పోలింగ్‌, 24న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.